
పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ పథకాలు ఎవరి వ్యక్తిగత దాతృత్వమో కాదు: అసదుద్దీన్
సంక్షేమ పథకాల లబ్ధిని ఓటరు జాబితాలతో ముడిపెడుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ఇటీవలి విధానపరమైన నిర్ణయాలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) డ్రైవ్ సమయంలో ఓటరు జాబితా నుంచి మినహాయించబడిన అనేక మంది నిజమైన ఓటర్లకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రేషన్‌ను నిరాకరించడంపై ఆయన మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంక్షేమ ప్రయోజనాలను ఓటరు జాబితాతో లింక్ చేసి, సర్ సమయంలో తొలగించబడిన వారికి రేషన్, ఇతర సౌకర్యాలను నిరాకరిస్తోంది. జాబితాలో 'ఆబ్సెంట్' లేదా 'షిఫ్టెడ్' అని మార్క్ చేయబడిన వారు, గత ఎన్నికలలో ఓటరు స్లిప్పులు అందుకోని వారు కూడా ఈ బాధితుల్లో ఉన్నారు. కానీ వీరిలో చాలా మంది నిజమైన ఓటర్లే అని పేర్కొన్నారు. అసలు రేషన్ లేదా సంక్షేమ పథకాల ప్రాప్యత ఓటరు జాబితాపై ఎందుకు ఆధారపడాలని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఓటరు జాబితానే నిర్ణయాత్మక అంశంగా మారితే, ఇక బయోమెట్రిక్ ప్రమాణీకరణ వల్ల ప్రయోజనం ఏముందని నిలదీశారు.
పశ్చిమ బెంగాల్ సంక్షేమ పంపిణీ నమూనాను తీవ్రంగా తప్పుపట్టిన ఓవైసీ, లబ్ధిదారులను పరిశీలించడానికి ఓటరు జాబితాలను ఎందుకు వాడుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలు ఓటర్లకు ఇచ్చే బహుమతులు కావు, అవి అర్హులైన పౌరులందరికీ చెందుతాయి. ఈ చర్య వెరిఫికేషన్ లాగా కాకుండా, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి.. నిరుపేదలు, ముఖ్యంగా మహిళలు, ఎస్సీలు, ముస్లింల జీవితాలను మరింత కష్టతరం చేసే ప్రయత్నంలా కనిపిస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ సీఎం సువేందు పేరును ప్రస్తావిస్తూ, ప్రభుత్వం పథకాలను ఆయన వ్యక్తిగత ఆస్తిలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కానీ అవి ప్రజల సొమ్ముతో నడుస్తున్నాయి, అర్హులైన ప్రతి పౌరుడి హక్కు అని ఓవైసీ స్పష్టం చేశారు.
టీఎంసీ అవినీతిపై దిలీప్ ఘోష్ ఆరోపణలు
మరోవైపు పశ్చిమ బెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ మాట్లాడుతూ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ పతనం వైపు దూసుకుపోతోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల నుంచి టీఎంసీ నాయకులు నిధులను లూటీ చేసి ఆస్తులు కూడబెట్టారని, వారిని చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. టీఎంసీలో పైనుంచి కిందటి వరకు అవినీతి రాజ్యమేలుతోందని, పేదల సంపదను దోచుకున్న వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు.
లక్ష్మీ భండార్, అన్నపూర్ణ భండార్ వంటి సంక్షేమ పథకాల గురించి ఘోష్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రయోజనాలను పొందడానికి 'భారత పౌరసత్వం' ప్రాథమిక నిబంధన అని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ప్రస్తావిస్తూ, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి ఇంకా పౌరసత్వం పొందని హిందూ శరణార్థులకు ఈ చట్టం వర్తిస్తుందని చెప్పారు. ప్రజలందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని, లేనిపక్షంలో పౌరసత్వం లేని వారు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
