Let's talk: editor@tmv.in
డీఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి: ఎమ్మెల్యే చంద్రశేఖర్

డీఎస్సీ వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి: ఎమ్మెల్యే చంద్రశేఖర్

Gaddamidi Naveen
7 జూన్, 2026

డీఎస్సీ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులు అడుగుతున్న కీలక ప్రశ్నలకు ప్రభుత్వం స్పందించకుండా మౌనం పాటిస్తోందని ఆయన విమర్శించారు. అత్యంత గోప్యంగా నిర్వహించాల్సిన పరీక్షా ప్రక్రియలో ఎస్సీఈఆర్టీలో పనిచేసే ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి పాత్ర ఏమిటో ప్రభుత్వం వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనపెట్టి ఎస్సీఈఆర్టీ కన్వీనర్‌కే ప్రశ్నపత్రాల తయారీతో పాటు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో ప్రథమ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించిన నవీన్‌కు ఉద్యోగం ఇవ్వకుండా ఎందుకు నిలిపివేశారో వెల్లడించాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన వివరణలు ఇస్తోందని ఆరోపించారు.

అభ్యర్థుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ప్రశ్నపత్రాల లీకేజీ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మెరిట్ జాబితాలను పదేపదే మార్చడం, ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లా కలెక్టరేట్ల వద్ద ప్రదర్శించకపోవడం కూడా అనుమానాలకు కారణమవుతోందన్నారు.

అలాగే స్పోర్ట్స్ కోటాను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచిన జీవోల వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకు నిబంధనలు మార్చి, అనంతరం వాటిని రద్దు చేశారని ఆరోపించారు. మొత్తం వ్యవహారం డీఎస్సీ నియామకాల పారదర్శకతపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తోందని, కూటమి ప్రభుత్వం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు.