
ఫీడ్ కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను ప్రభుత్వం ద్రోహం చేస్తుంది: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నెముకలాంటి ఆక్వా రంగం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు కోలుకోలేని దెబ్బతింటున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపు వెనుక భారీ కుట్ర దాగి ఉందని ప్రభుత్వం–కంపెనీల మధ్య ఉన్న రహస్య ఒప్పందాల వల్లే రైతులకు ఈ కష్టం వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు.
అయితే గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతుల కోసం తీసుకొచ్చిన పటిష్టమైన వ్యవస్థను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కావాలనే నిర్వీర్యం చేసిందని జగన్ విమర్శించారు. అప్పట్లో ముఖ్యమంత్రి నేతృత్వంలో పనిచేసిన అప్సాడ అనే సంస్థ ద్వారా ఫీడ్, సీడ్ నాణ్యతను తనిఖీ చేయడమే కాకుండా ధరలు పెరగకుండా గట్టి పర్యవేక్షణ ఉండేదని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థను పక్కన పెట్టడం వల్ల కంపెనీలు తమకు నచ్చినట్టుగా ధరలు పెంచుతూ సామాన్య రైతు నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు.
ఫీడ్ కంపెనీలు కనీసం ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు కూడా తీసుకోకుండానే రేట్లు పెంచుతున్నాయని దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. రైతుల కష్టార్జితం కంపెనీల పాలవుతుంటే చూస్తూ ఊరుకోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం ఆక్వా రైతులు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ విషయమై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పెరిగిన ఫీడ్ ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆక్వా రైతుల పక్షాన నిలబడి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కష్టాల్లో ఉన్న రైతును ఆదుకోకపోతే ఈ ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
