Let's talk: editor@tmv.in
స్కూళ్లు రీ-ఓపెన్ చేసే నాటికి పూర్తి వసతులతో ప్రభుత్వ హాస్టళ్లు: ఏపీ సీఎం

స్కూళ్లు రీ-ఓపెన్ చేసే నాటికి పూర్తి వసతులతో ప్రభుత్వ హాస్టళ్లు: ఏపీ సీఎం

Panthagani Anusha
15 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. నేరగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడాలంటే భయపడేలా శాంతిభద్రతలు ఉండాలి. తప్పు చేసిన వారికి త్వరితగతిన శిక్షలు పడేలా చూడాలి అని పోలీసు శాఖను ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు అమలు చేస్తున్న 'ఈగల్' విధానాన్ని మరింత పటిష్టం అధికారులను ఆదేశించారు.

సాంకేతికత ఆవిష్కరణలు

'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' ద్వారా విద్యార్థి దశ నుంచే వినూత్న ఆలోచనలను ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఎన్విడియా వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి రాష్ట్రంలో బలమైన ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందించడానికి డ్రోన్ సాంకేతికతను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తిస్థాయి మౌలిక వసతులతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సౌకర్యాలు, పారిశుద్ధ్యం, మహిళా భద్రత, అన్న క్యాంటీన్ల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు

జూన్ నెలలో స్కూళ్లు తెరిచే సమయానికి హాస్టళ్లలో టాయిలెట్లు, ఆర్వో ప్లాంట్లు వంటి వసతులపై ఎటువంటి ఫిర్యాదులు రాకూడదని సీఎం స్పష్టం చేశారు. "హాస్టళ్లలో వసతుల మెరుగుదలకు సాస్కీ నిధులు కేటాయించాం. నిధులు ఇచ్చిన తర్వాత కూడా సమస్యలు తలెత్తితే అది అధికారుల బాధ్యతారాహిత్యమే అవుతుంది అని ఆయన హెచ్చరించారు. ఆహారం, నీటి సరఫరా పారిశుద్ధ్యం విషయంలో రాజీ పడకూడదని ఉన్నతాధికారులు నిరంతరం క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని సూచించారు.

పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, వీధి దీపాలు, చెత్త సేకరణ వంటి ప్రాథమిక అంశాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని కలుషితం లేని స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని పైపులైన్లలో డ్రైనేజీ నీరు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో తాడిపత్రి పట్టణాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా 'జలధార' కార్యక్రమం ద్వారా చెరువులను నీటితో నింపే ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.