
తెలంగాణ పోలీసులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తమ సిబ్బంది సంక్షేమం దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పోలీస్ అధికారులు, సిబ్బంది తమ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలుగా సెలవు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసు విధి నిర్వహణ అత్యంత ఒత్తిడితో కూడుకున్నదని, శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది అనేక వ్యక్తిగత త్యాగాలు చేస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. వారి అంకితభావానికి గుర్తింపుగా, సిబ్బందిలో నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ప్రతి పోలీస్ ఉద్యోగి తన జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లను కుటుంబంతో కలిసి జరుపుకోవడం వల్ల పని-జీవిత సమతుల్యత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సెలవు నిబంధనలు
హోదా లేదా ర్యాంకుతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు అందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. సిబ్బంది తమ సర్వీస్ రిజిస్టర్ లోని వివరాల ప్రకారం సరైన ఆధారాలతో ముందస్తుగా లిఖితపూర్వక విన్నపం సమర్పించాలి. అత్యవసర డ్యూటీలు ఉంటే తప్ప, సిబ్బంది కోరిన వెంటనే సెలవు మంజూరు చేయాలని యూనిట్ అధికారులను డీజీపీ ఆదేశించారు. అయితే, ఈ సెలవును ఒక హక్కుగా భావించకూడదని, అత్యవసర సమయాల్లో పైఅధికారులు సెలవును నిరాకరించే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ మానవీయ నిర్ణయంపై పోలీస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
