
చిత్తూరులో రూ.2,550 కోట్లతో భారీ పరిశ్రమ..క్యాథోడ్ మెటీరియల్ యూనిట్‌కు సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ తయారీ రంగాల్లో మరో భారీ ముందడుగు వేసింది. చిత్తూరు జిల్లాలో క్యాథోడ్ మెటీరియల్ తయారీ యూనిట్ స్థాపనకు స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదించిన రూ.2,550 కోట్ల భారీ పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 'ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్ తయారీ విధానం (4.0) 2025–30' కింద ఈ ప్రాజెక్టును ఆమోదించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
105 ఎకరాల్లో కొలువుదీరనున్న పరిశ్రమ
చిత్తూరు జిల్లాలోని గుడుపల్లె మండలంలో సుమారు 105 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. లిథియం-అయాన్ బ్యాటరీల తయారీలో అత్యంత కీలకమైన 'క్యాథోడ్ మెటీరియల్స్'ను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఎలక్ట్రానిక్స్ బ్యాటరీ వాల్యూ చైన్‌లో ఈ యూనిట్ దేశీయంగా కీలక పాత్ర పోషించడమే కాకుండా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి సరికొత్త ఊతమివ్వనుంది.
బ్యాటరీ సామర్థ్యానికి వెన్నెముక
సాధారణంగా లిథియం-అయాన్ బ్యాటరీల పనితీరు శక్తి నిల్వ సామర్థ్యం, భద్రత వాటి జీవనకాలం వంటి అంశాలన్నీ అందులో వాడే క్యాథోడ్ మెటీరియల్స్‌పైనే ఆధారపడి ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలు , స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. బ్యాటరీ తయారీ వ్యయంలో క్యాథోడ్ మెటీరియల్స్‌దే ప్రధాన భాగం కావడంతో వీటిని స్వదేశీయుంగా ఉత్పత్తి చేయడం వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
వ్యూహాత్మక ముందడుగు
ప్రపంచవ్యాప్తంగా విద్యుదీకరణ దిశగా జరుగుతున్న మార్పులు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాధాన్యం సంతరించుకోనుంది. "ఈ యూనిట్ ఏర్పాటుతో రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా మారుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారత్ తన స్వయం సమృద్ధిని చాటుకోవడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది అని అధికారులు పేర్కొన్నారు. దీని ద్వారా స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు అనుబంధ పరిశ్రమల విస్తరణకు మార్గం సుగమం కానుంది.
