

వైద్య విద్య నాణ్యతపై సర్కార్ ఫోకస్.. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపుపై పరిశీలన!
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యా ప్రమాణాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరతను అధిగమించడం, బోధన నాణ్యతను మెరుగుపరచడం, కేంద్ర నిధుల వినియోగాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో వైద్య విద్య, బడ్జెట్ వినియోగం, మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, పీజీ సీట్ల పెంపు వంటి పలు కీలక అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ముందు నాణ్యమైన వైద్య విద్య అవసరమని స్పష్టం చేశారు. అందుకోసం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో జాతీయ వైద్య సంఘం (ఎన్‌ఎంసీ) నిర్దేశించిన ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని కనీసం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు దేశవ్యాప్తంగా టాప్–100 మెడికల్ కళాశాలల జాబితాలో స్థానం సంపాదించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
ప్రొఫెసర్ల కొరతపై ఆందోళన
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల కొరత వైద్య విద్య నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దాదాపు 800 ప్రొఫెసర్ల పోస్టులు ఉండగా వాటిలో సుమారు 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా 16 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 159 ప్రొఫెసర్ పోస్టులకు గాను 106 పోస్టులు ఖాళీగా ఉండటం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు.
ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్‌కు మూడు పీజీ సీట్లు కేటాయించే అవకాశం ఉండటంతో ప్రొఫెసర్ల కొరత వల్ల రాష్ట్రం విలువైన పీజీ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. మరోవైపు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు 70 సంవత్సరాలుగా ఉండటంతో వారికి ఎక్కువ మంది అధ్యాపకులు అందుబాటులో ఉండి అదనపు పీజీ సీట్లు లభిస్తున్నాయని వివరించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కూడా ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. దీనిపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్‌ను ఆదేశించారు.
ప్రొఫెసర్ పోస్టులను నిబంధనల ప్రకారం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. అయితే అనేక విభాగాల్లో పదోన్నతికి అర్హులైన అసోసియేట్ ప్రొఫెసర్లు లేకపోవడంతో ఖాళీలు పేరుకుపోతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రైవేటు మెడికల్ కళాశాలలపై కఠిన నిఘా
కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో తగిన బోధనా వసతులు లేకపోయినా అధిక సంఖ్యలో సీట్లు పొందుతున్నాయనే సమాచారం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. అలాంటి కళాశాలలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఎన్‌ఎంసీ ప్రమాణాల ప్రకారం అన్ని మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించారు.
కళాశాలల్లో గుర్తించిన లోపాలపై వెంటనే సవరణ చర్యలు చేపట్టాలని, ఈ ప్రక్రియపై క్రమం తప్పకుండా నివేదికలు సమర్పించాలని కూడా మంత్రి సూచించారు.
గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం వైద్య విద్య విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ అదనంగా 230 ఎంబీబీఎస్ సీట్లు, 250 పీజీ సీట్లు కల్పించినట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు మంత్రికి వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సీట్లు సాధించే దిశగా ప్రొఫెసర్ల కొరతను తగ్గించడం అత్యంత అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు.
హాజరులో రాజీ లేదు.. ఆన్‌లైన్ వ్యవస్థ తప్పనిసరి
వైద్య విద్యార్థుల హాజరు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని మంత్రి స్పష్టం చేశారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకే వార్షిక పరీక్షలకు అనుమతి ఉంటుందని గుర్తు చేశారు.
ప్రస్తుతం అమలులో ఉన్న హాజరు నమోదు విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, విద్యార్థుల హాజరును పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసి పర్యవేక్షించే వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
'బెడ్ సైడ్ ఎడ్యుకేషన్'పై ప్రత్యేక దృష్టి
వైద్య విద్యలో అత్యంత కీలకమైన 'బెడ్ సైడ్ ఎడ్యుకేషన్' అంటే రోగులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ బోధించే విధానంలో నిర్లక్ష్యం చోటుచేసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. విద్యార్థుల్లో సేవాభావం, నైతిక విలువలు పెంపొందించే విధంగా బోధన సాగాలని మంత్రి ఆకాంక్షించారు.
బడ్జెట్ వినియోగంపై అసంతృప్తి
2026-27 ఆర్థిక సంవత్సరానికి వైద్య, ఆరోగ్య శాఖకు మొత్తం రూ.18,216 కోట్ల బడ్జెట్ కేటాయించగా, తొలి త్రైమాసికంలో రూ.4,130 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మొత్తం బడ్జెట్‌లో 22.72 శాతం.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదిత రూ.2,308 కోట్ల సాయంలో జూన్ నెలాఖరు వరకు కేవలం రూ.357 కోట్లు మాత్రమే వినియోగించడం (15.45 శాతం)పై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లుల అప్‌లోడ్‌లో జాప్యం, నిధుల విడుదలలో ఆలస్యం వంటి కారణాలను అధికారులు వివరించగా, ఈ అంశాలపై ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుని వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
రెండో త్రైమాసికం ముగిసే నాటికి 50 శాతం వ్యయం లక్ష్యం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై-సెప్టెంబర్ ముగిసే నాటికి వార్షిక బడ్జెట్, కేంద్ర నిధుల వినియోగాన్ని కనీసం 50 శాతానికి తీసుకురావాలని మంత్రి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. అన్ని విభాగాలు, ఏపీఎస్‌ఎంఐడీసీ పరస్పర సమన్వయంతో నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రాధాన్య ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్,ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
