Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో ‘లక్ష’ ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం

హైదరాబాద్‌లో ‘లక్ష’ ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం

Panthagani Anusha
28 మే, 2026

రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలో తొలి విడత కింద లక్ష లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ ( ఎల్‌ఐజీ ) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బుధవారం నగరంలోని పలు నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.

మంత్రి అజారుద్దీన్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలతో కలిసి ఆయన నాంపల్లి, మలక్‌పేట్, బహదూర్‌పురా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కుల్సుంపురా, అఫ్జల్ సాగర్ ప్రాంతాలతో పాటు కాలదేరా, గడ్డియన్నారం పరిధుల్లో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలను ఖాళీ స్థలాలను వారు నిశితంగా పరిశీలించారు.

నగరంలో ఎక్కడెక్కడ వినియోగంలో లేని ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్న భవనాలు ఉన్నాయో వాటన్నింటినీ గుర్తించి ప్రజల అవసరాలకు అనుగుణంగా మల్చుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయా స్థలాల్లో పేదలకు అన్ని వసతులతో కూడిన గృహ వసతి కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న నివాస సమస్యను తగ్గించడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన నివాస వసతి కల్పించడమే ధ్యేయంగా ఈ ఎల్‌ఐజీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

అయితే తొలి విడతలో నిర్దేశించుకున్న లక్ష ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రణాళికల రూపకల్పన, మౌలిక వసతుల కల్పనపై ముందస్తు చర్యలు సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.