Let's talk: editor@tmv.in
విశాఖకు గూగుల్ మెగా బూస్ట్..1.25 లక్షల కోట్లతో ఏఐ డేటా సెంటర్

విశాఖకు గూగుల్ మెగా బూస్ట్..1.25 లక్షల కోట్లతో ఏఐ డేటా సెంటర్

Panthagani Anusha
27 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలవబోతోంది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం 'గూగుల్' విశాఖపట్నం వేదికగా భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. సుమారు 15 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.25 లక్షల కోట్లు) వ్యయంతో ఏర్పాటు చేయనున్న దేశంలోనే అతిపెద్ద 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్' ప్రాజెక్టుకు ఈ నెల 28న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో విశాఖ నగరం గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో కీలక కేంద్రంగా మారనుంది.

మూడు ప్రాంతాల్లో విస్తరణ

విశాఖ సమీపంలోని ఆనందపురం మండలం టర్లువాడతో పాటు అదివివరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల్లో ఈ డేటా సెంటర్ విస్తరించనుంది. గూగుల్ అనుబంధ సంస్థ 'రైడెన్ ఇన్ఫోటెక్' ఆధ్వర్యంలో అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ప్రాథమికంగా 1 గిగావాట్ సామర్థ్యంతో ప్రారంభమై భవిష్యత్తులో 5 గిగావాట్ల స్థాయికి చేరుకోనుంది.

లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు

ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ రంగానికి చెందిన నిపుణులకు భారీగా ఉపాధి లభించనుంది. ఏఐ క్లౌడ్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో సుమారు 1.88 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. కేవలం ఐటీ రంగమే కాకుండా విద్యుత్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ తయారీ వంటి అనుబంధ రంగాలకు కూడా ఈ ప్రాజెక్టు ఊతమివ్వనుంది.

విశాఖను డిజిటల్ హబ్‌గా మార్చేందుకు సబ్‌సీ కేబుల్ (సముద్రగర్భ కేబుల్) కనెక్టివిటీని కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల ఇంటర్నెట్ వేగం పెరగడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి డేటా రవాణాకు విశాఖ కేంద్ర బిందువుగా మారుతుంది. 'వికసిత భారత్ - 2047' లక్ష్యంలో భాగంగా ఏపీని దేశంలోనే నెంబర్ వన్ డిజిటల్ స్టేట్‌గా తీర్చిదిద్దేందుకు ఈ మెగా డేటా సెంటర్ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.