

అద్దె భవనాలకు గుడ్‌బై.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు
రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీవో, తహసీల్దార్, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భవనాల నిర్మాణాన్ని హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
ఈ మేరకు గురువారం సచివాలయంలో తన కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, ప్రజలకు సేవలు అందించేందుకు అనువుగా లేని కార్యాలయాల వివరాలను అధికారుల నుంచి సేకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజలకు నిత్యం సేవలు అందించే కార్యాలయాలు గౌరవప్రదంగా, ఆధునిక సదుపాయాలతో ఉండాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
మొదటి దశలో 136 కార్యాలయాలకు కొత్త భవనాలు
ప్రథమ దశలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న లేదా శిథిలావస్థలో ఉన్న 125 తహసీల్దార్ కార్యాలయాలు, 11 ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ భవనాలు ప్రజలకు సులభంగా చేరుకునే విధంగా, ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకోనున్నాయని తెలిపారు.
అదేవిధంగా, మరమ్మతులు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలపై కూడా నివేదికలు సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్‌ను మంత్రి ఆదేశించారు. అవసరమైన చోట్ల తక్షణమే మరమ్మతులు చేపట్టి కార్యాలయాల పనితీరును మెరుగుపరచాలని సూచించారు.
ఒకే నమూనాలో భవనాల నిర్మాణం
రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న ఆర్డీవో, తహసీల్దార్, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలు ఒకే నమూనాలో ఉండేలా ప్రత్యేక డిజైన్లు సిద్ధం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు సులభంగా సేవలు అందేలా, అధికారుల పనితీరు మరింత సమర్థవంతంగా ఉండేలా భవనాల రూపకల్పన జరుగుతుందని చెప్పారు.
డిజైన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది రూపు ఇస్తామని వెల్లడించారు. తక్కువ వ్యయంతో అత్యుత్తమ సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
త్వరలో నిర్మాణ పనుల ప్రారంభం
ఈ భవనాల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాలను వెంటనే గుర్తించాలని, నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
