
తెలంగాణ కార్మికులకు శుభవార్త.. రూ.20 వేల వరకు కనీస వేతనాలు
తెలంగాణ రాష్ట్రంలోని కోటి 11 లక్షల మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కార్మికుల చిరకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ రాష్ట్రంలో కనీస వేతనాలను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. పెంచిన ఈ కొత్త వేతనాలు 2026 జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కార్మిక సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకున్న తొలి ప్రధాన నిర్ణయం ఇదేనని సీఎం స్పష్టం చేశారు.
గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్మిక ఉపాధి శిక్షణ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఈ కీలక ప్రకటన చేశారు. పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెల భారాన్ని పరిగణలోకి తీసుకుని, కార్మిక సంఘాలు, యాజమాన్యాలు మరియు ఇతర స్టేక్‌హోల్డర్లతో విస్తృతంగా చర్చించిన అనంతరమే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నాలుగు కేటగిరీలు.. మూడు జోన్లు
కొత్త వేతన సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను నాలుగు కేటగిరీలుగా అదేవిధంగా భౌగోళిక ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించింది. జోన్-1 పరిధిలోకి మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2 పరిధిలోకి మున్సిపాలిటీలు, జోన్-3 పరిధిలోకి గ్రామీణ ప్రాంతాలు వస్తాయని సీఎం వివరించారు.
జోన్-1 పరిధిలో సవరించిన కనీస వేతనాల వివరాల ప్రకారం అన్‌స్కిల్డ్ (నైపుణ్యం లేని) కార్మికుల కనీస వేతనాన్ని రూ.12,750 నుంచి రూ.16,000కు, సెమీ స్కిల్డ్ (పాక్షిక నైపుణ్యం గల) కార్మికుల వేతనాన్ని రూ.13,152 నుంచి రూ.17,000కు పెంచారు. అదేవిదంగా స్కిల్డ్ (నైపుణ్యం గల) కార్మికులకు రూ.13,772 నుంచి రూ.18,500కు, హైలీ స్కిల్డ్ (ఉన్నత నైపుణ్యం గల) కార్మికులకు రూ.14,607 నుంచి రూ.20,000కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు
ఇదిలా ఉండగా తెలంగాణ సిద్ధించిన తర్వాత గత ప్రభుత్వం కార్మికుల వేతనాల పెంపును పూర్తిగా విస్మరించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే లక్షలాది మంది కార్మికులు ఇన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి వేతన సవరణపై సమగ్ర అధ్యయనం చేయించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
గల్ఫ్ కార్మికులకు రక్షణ.. యువతకు గ్లోబల్ స్కిల్స్
అంతర్జాతీయ స్థాయిలో స్కిల్డ్ లేబర్‌కు ఉన్న డిమాండ్‌ను యువత అందుకోవాలని సీఎం ఆకాంక్షించారు. జపాన్, జర్మనీ వంటి దేశాల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని యువత విదేశీ భాషలు నేర్చుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
ముఖ్యంగా గల్ఫ్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే కార్మికులకు ప్రభుత్వమే ప్రత్యేక శిక్షణ ఇచ్చి అక్కడి కంపెనీల అవసరాలకు అనుగుణంగా పంపించే ఏర్పాట్లు చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. దీనివల్ల ఏజెంట్ల చేతిలో కార్మికులు మోసపోకుండా రక్షణ లభిస్తుందన్నారు. గతంలో గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడమే గగనమయ్యేదని గుర్తుచేసిన సీఎం ఇప్పుడు తమ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలిచి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే కార్మిక సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
