
ఎన్నికల్లో ఓడిన అంగన్‌వాడీ సిబ్బందికి గుడ్ న్యూస్
రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన అంగన్వాడీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు (పునర్నియామకానికి) ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసి ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బందికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే రాజీనామా చేసిన అంగన్‌వాడీల స్థానాల్లో ఇప్పటివరకు వేరే ఇతర అభ్యర్థులెవరినీ నియమించకుండా ఉంటేనే, వారి పునర్నియామకానికి అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగానే సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సేవలు అందించే కీలక భాగస్వాములైన అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది అంగన్‌వాడీ సిబ్బందికి ఊరట లభించనుంది. అర్హులైన వారి దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిశీలించి, వీలైనంత త్వరగా వారిని తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు.
