
ఖమ్మంలో రూ. 300 కోట్లతో గోద్రేజ్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్: సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల భేటీ
తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తొలి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో గోద్రేజ్ ఆగ్రోవెట్ సంస్థ ప్రతినిధులు బుధవారం సమావేశమయ్యారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ప్రాసెసింగ్ మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో గోద్రేజ్ గ్రూప్ సంస్థల కార్పొరేట్ అఫేర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, గోద్రేజ్ ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగి రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న తొలి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.
ఖమ్మం జిల్లాలో రూ.300 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని, దీని ద్వారా 700 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు ఆధునిక నర్సరీ, పరిశోధన-అభివృద్ధి కేంద్రం, సీడ్ గార్డెన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఈ ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిందని పేర్కొన్నారు. సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని, అలాగే ప్రాసెసింగ్ యూనిట్‌కు అనుసంధానంగా రహదారిని విస్తరించాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రాసెసింగ్ యూనిట్‌కు అవసరమైన రహదారి విస్తరణ పనులను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు మరింత విస్తరించడమే కాకుండా, ఖమ్మం జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి సరికొత్త ఊతం లభించనుంది.
