Let's talk: editor@tmv.in
తెలంగాణలో 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు
తెలంగాణలో 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు
తెలంగాణలో 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు

తెలంగాణలో 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు

Gaddamidi Naveen
29 జూన్, 2026

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నప్పటికీ, నాటి అమరుల ఆకాంక్షలు, ఉద్యమ ఆశయాలు నేటికీ నెరవేరలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలంటే రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం’ రావడం అత్యంత అవసరమని, అందుకోసం పార్టీ కార్యకర్తలు సమిష్టిగా శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణలో మూడు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన నితిన్ నబిన్.. ఆదివారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానం ద్వారా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా యూనిట్ల నూతన బీజేపీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు.

మున్సిపల్ పోరుకు సమరశంఖం

త్వరలో జరగబోయే హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఇతర నగరాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీ కార్యకర్తలకు ఒక పెద్ద సవాల్ అని నితిన్ నబిన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల కేంద్ర పథకాల ద్వారా తెలంగాణ ప్రజలకు నిరంతరం సేవ చేస్తోంది. అయితే ఏ ఉద్దేశంతోనైతే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ప్రజలు కలలు కన్నారో.. ఆ స్థాయి అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి. ప్రధాని మోడీ 'వికసిత భారత్' కల నిజం కావాలంటే, తెలంగాణ గడ్డపై కూడా కమలం పువ్వు వికసించాల్సిందే అని నితిన్ పేర్కొన్నారు.

తెలంగాణలో బీజేపీ ఒక బయటి పార్టీ అంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. 1984 లో లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుందని, ఆ రెండింటిలో ఒక సీటు (హన్మకొండ) ఈ తెలంగాణ గడ్డ నుంచే లభించిందని ఆయన గుర్తుచేశారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ క్రమంగా విజయఢంకా మోగిస్తోందని, తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగిరే రోజు చాలా దూరంలో లేదని ధీమా వ్యక్తం చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు నిరంతరం పోరాటాలు చేస్తే.. చివరకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆ లబ్ధిని పొందిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి రాజీపడుతుందని, అలాంటి కాంగ్రెస్‌ను తెలంగాణలో ఓడించే సత్తా కేవలం బీజేపీ శ్రేణులకు మాత్రమే ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన అద్భుతమైన విజయాన్ని ఉదాహరణగా చూపుతూ.. అక్కడ కీలక పాత్ర పోషించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తెలంగాణలో కూడా రెట్టింపు ఉత్సాహంతో శ్రమించి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

సుష్మా స్వరాజ్ పాత్ర స్మరణ

జూన్ 2వ తేదీన ఢిల్లీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తాను పాల్గొన్న విషయాన్ని నితిన్ నబిన్ గుర్తుచేసుకుంటూ.. నాటి పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో దివంగత బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ పోషించిన చారిత్రాత్మక పాత్రను, ఆమె చేసిన పోరాటాన్ని కొనియాడారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి మహనీయుల ఆదర్శాలకు అనుగుణంగానే నేడు ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
BJPTelanganaNitinNabinDoubleEngineSarkarTelanganaPoliticsHyderabadBJP4TelanganaPoliticalNewsBreakingNewsIndiaPolitics
తెలంగాణలో 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు - Tholi Paluku