Let's talk: editor@tmv.in
సాగుకు భద్రత-అధిక ఆదాయం సాధించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

సాగుకు భద్రత-అధిక ఆదాయం సాధించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Panthagani Anusha
26 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సాగులో భద్రతతో పాటు అధిక లాభాలు వచ్చేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్నతాధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సంప్రదాయ సాగుతో పాటు ఉద్యానవన, ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ఉద్యానవన (హార్టికల్చర్) సాగును ప్రస్తుతమున్న స్థాయి నుంచి 50 లక్షల ఎకరాలకు విస్తరించాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’గా తీర్చిదిద్దేందుకు క్లస్టర్ల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రపంచంలోనే ప్రత్యేకంగా 250 ఎకరాల్లో కోకో సిటీ ని ఏర్పాటు చేయాలని ఇది ప్రగతిశీల రైతులకు ఒక విజ్ఞాన కేంద్రంగా (ఎక్స్‌పీరియన్స్ సెంటర్) ఉపయోగపడాలని సూచించారు. ఇందుకోసం తగిన స్థలాన్ని తక్షణమే గుర్తించి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఇక మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల పట్ల రైతులకు అవగాహన కల్పించాలని ఏడాది పొడవునా పొలం పచ్చగా ఉండాలి రైతు చేతిలో డబ్బు ఆడాలి అనే నినాదంతో భూమిని భాగాలుగా విభజించి బహుళ పంటల విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రకృతి సాగులో పండించే ఉత్పత్తులకు ప్రత్యేకంగా సర్టిఫికేషన్ ఇప్పించి వాటిని ప్రీమియం ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2026-27 నాటికి రాష్ట్రంలోని మొత్తం 13,300 గ్రామ పంచాయతీలకు ప్రకృతి సాగును విస్తరించి, 25 లక్షల మంది రైతులను ఇందులో భాగస్వాములను చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. గత రబీలో యూరియా వినియోగం తగ్గడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కొత్త రకపు పంటల సాగుపై సీఎం కీలక సూచనలు చేశారు. అరకు ఏజెన్సీలో కుంకుమపువ్వు సాగుకు ఉన్న అవకాశాలను శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలించాలని అనంతపురంలో ప్రయోగాత్మక ఆపిల్ సాగును మరింత విస్తరించాలని కోరారు. వీటితో పాటు అవకాడో, అంజీర్, పనస, జామ, మిరియాల సాగును పెంచి అంజీర్ వంటి పండ్లను డ్రైఫ్రూట్స్‌గా మార్చి విలువ ఆధారిత ఉత్పత్తులుగా విక్రయించాలని తెలిపారు. ‘ఏపీ మష్రూమ్ మిషన్ 2026-31’ ద్వారా ఏడాదికి లక్ష మెట్రిక్ టన్నుల పుట్టగొడుగుల ఉత్పత్తిని సాధించాలని స్పష్టం చేశారు.

మరోవైపు ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న అధికారుల నివేదికపై సీఎం స్పందించారు. దీనికి విరుగుడుగా ‘ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్’ విధానాన్ని ముమ్మరం చేయాలన్నారు. వర్షాలకు ముందే విత్తనాలు వేయడం ద్వారా ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అదనపు ఆదాయం లభిస్తుందని ఈ ఏడాది 20 లక్షల ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయాలని ఆదేశించారు. రైతు బజార్ల నుంచి నేరుగా వినియోగదారుల ఇళ్లకు డోర్ డెలివరీ చేసే వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు.

సాంకేతికతను వ్యవసాయంలో విరివిగా వాడాలని ‘ఫార్మర్ యాప్’ ద్వారా రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలగాలని సీఎం అన్నారు. ఇప్పటికే 8 లక్షల మంది రైతులు ఇందులో నమోదు చేసుకున్నారని ‘ఆర్‌ఎస్‌కే ఇంటిలిజెన్స్ హబ్’ డ్యాష్‌బోర్డ్ ద్వారా విత్తనాలు, ఎరువుల సరఫరా బీమా తదితర అంశాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పేద రైతు కుటుంబాలకు డెయిరీ, పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం కల్పించేలా ప్రత్యేక పథకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.