

ఒలింపిక్స్‌లో బంగారు పతకాలే లక్ష్యం: మంత్రి వాకిటి శ్రీహరి
అంతర్జాతీయ క్రీడారంగంలో, ముఖ్యంగా ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా యువజన, క్రీడా వారోత్సవాలను ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడా డ్రైవ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి 5 కిలోమీటర్ల వాకథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.
డ్రగ్స్‌కు దూరం.. క్రీడలకు దగ్గర
మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పిల్లలు, యువత డ్రగ్స్ ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, క్రీడల్లో చురుగ్గా రాణించాలనేదే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధాన సంకల్పమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రతిభావంతులైన యువ అథ్లెట్లను ప్రోత్సహించడానికి ఇటీవల నిర్వహించిన "సీఎం కప్" క్రీడా పోటీల్లో సుమారు 3.5 లక్షల మంది పిల్లలు పాల్గొన్నారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలు, మైదానాలను మెరుగుపరచడంతో పాటు కోచ్‌లకు పూర్తి మద్దతు ఇవ్వడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన 10 ఏళ్ల కాలంలో క్రీడా రంగాన్ని, మైదానాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి శ్రీహరి ఆరోపించారు.
యువతను, పౌరులను ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలి వైపు ప్రోత్సహించేందుకు స్టేడియంలో ఏర్పాటు చేసిన 'జుంబా' నృత్య కార్యక్రమంలో మంత్రులు, అధికారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం, 5 కిలోమీటర్ల వాకథాన్‌ను మంత్రులు జెండా ఊపి ప్రారంభించి వారు కూడా నడుస్తూ పౌరుల్లో ఉత్సాహాన్ని నింపారు.
రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు
మార్చి 6న ప్రారంభమైన ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా.. మే 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్రీడా పోటీలలు, ఫిట్‌నెస్ కార్యకలాపాలు, అవగాహన సదస్సులు, యువతను భాగస్వామ్యం చేసే విభిన్న కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు క్రీడా శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, యువత సాధికారతకు, క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ వారోత్సవాల నిర్వహణే అందుకు నిదర్శనమని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు రాణించేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, మల్ రెడ్డి రామ్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలా దేవి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
