Let's talk: editor@tmv.in
మిస్ ఇండియాగా గోవా సుందరి సాధ్వి సతీష్

మిస్ ఇండియాగా గోవా సుందరి సాధ్వి సతీష్

Panthagani Anusha
20 ఏప్రిల్, 2026

అందం, ఆత్మవిశ్వాసం ఉట్టిపడేలా సాగిన అందాల పోటీలో గోవాకు చెందిన యువతి సాధ్వి సతీష్ సైల్ విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా సినీ, ఫ్యాషన్ రంగాల దృష్టిని ఆకర్షించిన 'ఫెమినా మిస్ ఇండియా వరల్డ్–2026' కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని 'కీఐఐటీ' వేదికగా శనివారం రాత్రి జరిగిన 61వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేలో సాధ్విని విజేతగా ప్రకటిస్తూ న్యాయనిర్ణేతలు కిరీటాన్ని అలంకరించారు.

పోటాపోటీగా తుది పోరు

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన 30 మంది అందాల భామలు ఈ ప్రతిష్టాత్మక పోటీలో తలపడ్డారు. తుది రౌండ్ వరకు ఎంతో ఆత్మవిశ్వాసంతో సాగిన ఈ పోటీలో తన వ్యక్తిత్వం, చురుకైన సమాధానాలతో సాధ్వి న్యాయనిర్ణేతలను మంత్రముగ్ధులను చేశారు. మహారాష్ట్రకు చెందిన రాజనందిని పవార్ ప్రథమ రన్నరప్‌గా నిలవగా జమ్మూ కాశ్మీర్ యువతి శ్రీ అద్వైత జి ద్వితీయ రన్నరప్‌గా ఎంపికయ్యారు. ఈ గెలుపుతో సాధ్వి 75వ ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.

కల నిజమైంది: సాధ్వి

విజయం అనంతరం సాధ్వి సతీష్ సైల్ భావోద్వేగానికి లోనయ్యారు. "మిస్ ఇండియా కిరీటం గెలవడం నా జీవితకాల స్వప్నం. ఈ విజయం నాపై బాధ్యతను మరింత పెంచింది. అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతిని ప్రతిభను చాటిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అలనాటి నటి జీనత్ అమన్ మాట్లాడుతూ భారతీయ యువతులు ప్రపంచ వేదికలపై సత్తా చాటుతున్నారని శిక్షణ పొందితే అద్భుతాలు సృష్టిస్తారని ప్రశంసించారు.

సేవలోనూ ముందు

సాధ్వి కేవలం అందాల పోటీలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా మూగ, చెవుడు సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల సంక్షేమం కోసం, అదేవిదంగా పోషకాహార లోప నిర్మూలన కోసం ఆమె చేస్తున్న కృషిని ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు.

ఒడిశాలో తొలిసారి

ఫెమినా మిస్ ఇండియా చరిత్రలో తొలిసారిగా తుది పోటీలు ఒడిశా వేదికగా జరగడం విశేషం. పోటీలకు ముందు అందాల భామలు కోణార్క్ సూర్య దేవాలయం, చంద్రభాగా తీరాలను సందర్శించి రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకున్నారు.