Let's talk: editor@tmv.in
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. కేకేఆర్‌పై గుజరాత్ ఘన విజయం
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. కేకేఆర్‌పై గుజరాత్ ఘన విజయం
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. కేకేఆర్‌పై గుజరాత్ ఘన విజయం

గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. కేకేఆర్‌పై గుజరాత్ ఘన విజయం

Shaik Mohammad Shaffee
18 ఏప్రిల్, 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ మరోసారి సత్తా చాటింది. శుక్రవారం జరిగిన పోరులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (86) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌కు తోడు, పేసర్లు కాగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న గుజరాత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో కోల్‌కతా ఈ సీజన్‌లో ఇప్పటివరకు పరుగుల ఖాతా తెరవలేక పట్టికలో అట్టడుగునే నిలిచింది.

ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గుజరాత్ పేసర్లు చుక్కలు చూపించారు. పవర్ ప్లేలోనే రబాడ, సిరాజ్ ద్వయం ప్రత్యర్థి బ్యాటర్లను పెవిలియన్‌కు క్యూ కట్టించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే అజింక్యా రహానే (0)ను అవుట్ చేసి సిరాజ్ షాకివ్వగా, ఆ వెంటనే రబాడ తన అద్భుతమైన అవుట్‌స్వింగర్‌తో యువ బ్యాటర్ రఘువంశీని బోల్తా కొట్టించాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న టిమ్ సీఫెర్ట్ సైతం రబాడ వేగానికి తలవంచి గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ 37 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

గ్రీన్ ఒంటరి పోరాటం

ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఆల్‌రౌండర్ కామరూన్ గ్రీన్ (79; 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత పోరాటం చేశాడు. ఈ సీజన్‌లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న గ్రీన్, కీలక సమయంలో చెలరేగి ఆడాడు. రోవ్‌మన్ పావెల్‌తో కలిసి 55 పరుగులు, అనుకుల్ రాయ్‌తో కలిసి 60 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో గ్రీన్ వరుస ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అదృష్టం కూడా కలిసి రావడంతో వ్యక్తిగత స్కోరు 62 వద్ద సుందర్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు. చివరి బంతికి అవుట్ అయ్యే వరకు క్రీజులో ఉన్న గ్రీన్ ఒక్కడే పోరాడటంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేయగలిగింది.

గిల్ మెరుపులు.. బట్లర్ ఫినిషింగ్

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ చూడచక్కని స్ట్రైట్ డ్రైవ్‌లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ కేవలం ఒక వికెట్ నష్టానికి 71 పరుగులు చేసి విజయాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. గిల్ తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో క్లాస్ బ్యాటింగ్ ప్రదర్శించాడు. గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్.. ఎదుర్కొన్న మొదటి బంతికే ఫోర్ కొట్టి, ఆ తర్వాత సిక్సర్లతో కేకేఆర్ బౌలర్ల ఆశలపై నీళ్లు చల్లాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3, సిరాజ్ 2, అశోక్ శర్మ 2 వికెట్లతో రాణించారు.