Let's talk: editor@tmv.in
హైద‌రాబాద్‌‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం

హైద‌రాబాద్‌‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం

Gaddamidi Naveen
19 ఏప్రిల్, 2026

నగరంలో పాదచారుల భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది. నగరంలోని మొత్తం 6 జోన్లలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై అధికారులు శనివారం ఉక్కుపాదం మోపుతున్నారు. పాదచారులకు ఇబ్బంది కలిగిస్తూ నిర్మించిన వందలాది శాశ్వత, తాత్కాలిక అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. జేసీబీ యంత్రాల సహాయంతో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ, ఫుట్‌పాత్‌లను క్లియర్ చేశారు.

అత్తాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న అక్రమ షెడ్లు, బోర్డులు, వ్యాపార సంస్థలు ఆక్రమించిన స్థలాలను అధికారులు క్లియర్ చేశారు.అలాగే గాంధీ ఆసుపత్రి పరిసరాలు, సుల్తాన్ బజార్ రోడ్, కాచిగూడ జంక్షన్, మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ వంటి ప్రదేశాల్లో ఆక్రమణల తొలగింపు వేగంగా కొనసాగుతోంది. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహించడం, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలను కట్టడి చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు.

ప్రతి శనివారం నగరవ్యాప్తంగా ఈ 'స్పెషల్ డ్రైవ్' నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పాదచారులు రోడ్లపై కాకుండా సురక్షితంగా ఫుట్‌పాత్‌లపై నడిచేలా చూడటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం. నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారికి, అక్రమంగా షెడ్లు నిర్మించిన వారికి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్లీన్-అప్ డ్రైవ్ ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, పాదచారుల భద్రత గణనీయంగా పెరుగుతుందని జీహెచ్‌ఎంసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.