
గ్యాస్ ధరల పెంపు ‘కార్మికులకు మోడీ ఇచ్చిన మే డే గిఫ్ట్’: కేటీఆర్
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్యాస్ ధరలను పెంచి, పేద, కార్మిక వర్గాలపై మోయలేని భారాన్ని మోపారని ఆయన మండిపడ్డారు. ఈ పెంపును తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మే డే వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. కార్మికులను ఆదుకోవాల్సింది పోయి, ప్రధాని నరేంద్ర మోడీ వారికి 'మే డే గిఫ్ట్'గా ఈ ధరల భారాన్ని బహుమతిగా ఇచ్చారు అని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలు అయిపోగానే సిలిండర్, పెట్రోల్ ధరలు పెంచడం మోడీకి అలవాటు అని అన్నారు. చమురు సంస్థలు కమర్షియల్ గ్యాస్ ధరలను ఏకంగా రూ.993 పెంచాయని, ఇది దేశ చరిత్రలోనే అత్యధికమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,315కి చేరుకుందని వివరించారు.
అలాగే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ లేదా మార్కెట్ ధరల సిలిండర్ ధరను రూ.549 నుంచి రూ.810.50కి పెంచారని చెప్పారు. ఈ ధరల పెంపు వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న తరహా వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు భరించలేక హోటళ్లు మూతపడితే, కార్మికులు రోడ్డున పడతారని ఆయన హెచ్చరించారు.
అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వల్ల ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో గ్యాస్ ధరలు పెంచడం సామాన్యుడి వెన్ను విరిచినట్లేనని కేటీఆర్ అన్నారు. రూపాయి విలువ పడిపోవడం, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల సామాన్య పౌరుడి జీవనం దుర్భరంగా మారిందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, సామాన్యుల కష్టాలను పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే ప్రజల పక్షాన పోరాడుతామని ఆయన పేర్కొన్నారు.
