
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్.. నలుగురు కార్మికులకు అస్వస్థత
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలోని థర్మల్ పవర్ ప్లాంట్ విభాగంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కార్మికులు ప్రమాదకరమైన విషవాయువును పీల్చడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురై స్పృహతప్పి పడిపోయారు. అదృష్టవశాత్తూ సకాలంలో స్పందించిన అధికారులు బాధితులకు తక్షణ వైద్య సాయం అందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ప్లాంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జె. మల్లికార్జున్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కార్మికుల థర్మల్ పవర్ ప్లాంట్ ఏరియాలో తమ విధుల్లో ఉండగా ఈ లీకేజీ సంభవించింది. గ్యాస్ వెలువడటాన్ని గమనించిన కార్మికులు అప్రమత్తమయ్యే లోపే దాని ప్రభావానికి లోనయ్యారు. బాధితులను వెంటనే ప్లాంట్ ప్రాంగణంలోనే ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ తర్వాత బాధితులు కోలుకోవడంతో సోమవారం రాత్రే వారిని డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు ధృవీకరించారు.
అయితే లీకైన వాయువును 'బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్' గా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో అధిక మొత్తంలో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందని ఇది ప్రాణహాని కలిగించే ప్రమాదకరమైన వాయువు అని డి.జి.ఎం వివరించారు. అసలు ఈ గ్యాస్ లీకేజీ ఏ సాంకేతిక లోపం వల్ల సంభవించింది అనే కోణంలో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని భద్రతా ప్రమాణాలపై ఆడిట్ నిర్వహిస్తున్నామని ప్లాంట్ వర్గాలు వెల్లడించాయి.
