Let's talk: editor@tmv.in
గండేపల్లిలో ‘ఉజ్వల పథకం ’ కింద 68 మందికి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ

గండేపల్లిలో ‘ఉజ్వల పథకం ’ కింద 68 మందికి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ

Panthagani Anusha
28 ఏప్రిల్, 2026

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద 68 మంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఉజ్వల పథకం కీలకంగా మారిందన్నారు. వంటలో ఇబ్బందులు లేకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవనం సాగించేలా ఈ పథకం తోడ్పడుతుందని వివరించారు.

అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, “తల్లికి వందనం” వంటి పథకాలతో పాటు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను అందించే చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.