
2027లో 'జీ20' శాటిలైట్ లాంచ్: ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ అంతరిక్ష రంగంలో భారత్ సాధించబోయే మరిన్ని మైలురాళ్ల గురించి కీలక విషయాలను వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరిగిన శాస్త్రవేత్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
పర్యావరణ మార్పులు, వాయు కాలుష్యం, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసే లక్ష్యంతో రూపొందిస్తున్న 'జీ20' ఉపగ్రహాన్ని 2027 నాటికి ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ఎటువంటి ఢీకొనడాలు లేకుండా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఘనత భారత్‌కే దక్కిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 433 వాణిజ్య ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది.
2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నారాయణన్ తెలిపారు. ఇది సాకారమైతే లాంచర్, శాటిలైట్ టెక్నాలజీలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల సరసన నిలుస్తుందని చెప్పారు. డీప్ ఓషన్ మిషన్ (సముద్రయాన్) కోసం 2.2 మీటర్ల వ్యాసం, 100 మిమీ మందం కలిగిన టైటానియం నౌకను తయారు చేసే ప్రక్రియలో ఇస్రో నిమగ్నమైందని వెల్లడించారు. వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా ఇస్రో తన సాంకేతికతను ఆధునీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ, ఇస్రో, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
