Let's talk: editor@tmv.in
పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్తు :మంత్రి దామోదర రాజనర్సింహ

పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్తు :మంత్రి దామోదర రాజనర్సింహ

Panthagani Anusha
26 మే, 2026

అడవుల నరికివేత, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.1.44 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా అటవీశాఖ నూతన కార్యాలయ భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మంత్రి కొండా సురేఖ సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో “అమృతవనం”, “హరితవనం” పేర్లతో రెండు ఆధునిక ఎకో పార్కులను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.

సంగారెడ్డి పరిసర ప్రాంతాల ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ఈ పార్కుల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. పర్యాటకుల స్పందన ఆధారంగా భవిష్యత్తులో ‘నైట్ స్టే’ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.

అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, రిజర్వ్ ఫారెస్టుల చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అడవి జంతువులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. త్వరలోనే నారాయణఖేడ్, జహీరాబాద్‌తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రకృతి సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వన మహోత్సవ కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, ప్రకృతి వనాలను అభివృద్ధి చేయడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. సంజీవరెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ వనిత సంతోష్, అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.