Let's talk: editor@tmv.in
ప్రపంచ స్థాయి గ్లోబల్ హబ్‌గా ‘ఫ్యూచర్ సిటీ’: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచ స్థాయి గ్లోబల్ హబ్‌గా ‘ఫ్యూచర్ సిటీ’: మంత్రి శ్రీధర్ బాబు

Gaddamidi Naveen
29 మే, 2026

హైదరాబాద్ శివార్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం ప్రకటించారు.

మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్మాణంలో ఉన్న కార్యాలయ భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో తీసుకుంటున్న ప్రతి నిర్ణయం, చేపడుతున్న ప్రతి కార్యక్రమం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాల కోసం ప్రస్తుతం బలమైన పునాది వేస్తున్నామని, తమ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2 లేదా జూన్ 3వ తేదీన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించే అంశంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నగరంలో ప్రత్యేక పోలీస్ కమిషనరేట్‌తో పాటు పలు కీలక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

లక్షలాది మంది యువతకు ఉపాధి

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఫ్యూచర్ సిటీ కేవలం తెలంగాణకే కాకుండా మొత్తం దేశానికే ఒక మైలురాయి ప్రాజెక్టుగా నిలవబోతోందని కొనియాడారు. లక్షలాది మంది నిరుద్యోగ యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలను కల్పించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన స్పష్టం చేశారు. కార్యాలయ పరిశీలన అనంతరం, మంత్రులిద్దరూ అక్కడే నిర్మాణంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ భవన నిర్మాణ పనులను కూడా వ్యక్తిగతంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.