Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో ఇంధన కొరత.. బంకుల వద్ద బారులుతీరిన వాహనదారులు

హైదరాబాద్‌లో ఇంధన కొరత.. బంకుల వద్ద బారులుతీరిన వాహనదారులు

Gaddamidi Naveen
28 ఏప్రిల్, 2026

నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఉందనే పుకార్ల నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు ఒక్కసారిగా క్యూ కట్టారు. అల్వాల్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో భారీ రద్దీ కనిపించగా, కొన్ని బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిచ్చాయి. సరఫరాలో తలెత్తిన తాత్కాలిక అంతరాయం వల్లే కొన్ని స్టేషన్లు మూతపడ్డాయని అధికారులు వెల్లడించారు. అల్వాల్‌లోని ఇండియన్ ఆయిల్ బంకులో ఇంకా స్టాక్ రాకపోవడంతో, మంగళవారం నాటికి పరిస్థితి చక్కబడుతుందని అంచనా వేస్తున్నారు. నగరంలోని మెజారిటీ బంకుల్లో కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయి. వాహనదారులు భయంతో అత్యధికంగా పెట్రోల్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, నిల్వలు త్వరలోనే అన్ని చోట్లా అందుబాటులోకి వస్తాయని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పౌరసరఫరాల శాఖ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురై పుకార్లను నమ్మవద్దని సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ ఇంధన పంపిణీ నిరంతరాయంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అధికారిక గణాంకాల ప్రకారం, సోమవారం సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 7,443 కిలో లీటర్ల పెట్రోల్. 11,081 కిలో లీటర్ల డీజిల్, సరఫరా జరిగింది. సామాన్య వాహనదారులు, రవాణా రంగం, రైతాంగ అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

కృత్రిమ కొరత సృష్టించినా, ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసినా లేదా ప్రజలను భయాందోళనకు గురిచేసేలా తప్పుడు వార్తలు ప్రచారం చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇంధన నిల్వలు లేదా అక్రమ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే పౌరసరఫరాల శాఖ హెల్ప్‌లైన్ నంబర్ 1967 కు కాల్ చేయాలని సూచించింది.