Let's talk: editor@tmv.in
ఏపీలో ఇంధన కొరత...పెట్రోల్ బంకుల వద్ద వాహనాల బారులు

ఏపీలో ఇంధన కొరత...పెట్రోల్ బంకుల వద్ద వాహనాల బారులు

Panthagani Anusha
28 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుందన్న వార్తలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఇంధనం దొరకదన్న భయంతో వేలాది మంది వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్దకు తరలిరావడంతో ప్రధాన నగరాలు, పట్టణాల్లో యుద్ధ వాతావరణం కనిపించింది. కిలోమీటర్ల మేర క్యూలైన్లు దర్శనమివ్వగా పలుచోట్ల తోపులాటలు జరిగాయి. అయితే రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

స్తంభించిన నగరాలు.. ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వలు

రాజమండ్రి, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. రాజమండ్రిలో ద్విచక్ర వాహనాలు, కార్లే కాకుండా భారీ లారీలు సైతం ప్రధాన రహదారులపై క్యూ కట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. భవిష్యత్తులో ఇంధనం దొరకదేమో అన్న ఆందోళనతో కొందరు ప్రజలు ప్లాస్టిక్ కంటైనర్లు, బాటిళ్లతో బంకులకు చేరుకుని నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. విజయవాడలోని ఆటోనగర్, అజిత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే మొదలైన రద్దీ సోమవారం నాటికి పతాక స్థాయికి చేరి వాహనదారులకు చుక్కలు చూపించింది.

డీజిల్ నిల్వల తగ్గుదలే కారణమా?

ఈ పరిస్థితిపై ఫ్యూయల్ రిటైలర్స్ అసోసియేషన్ గుంటూరు ప్రతినిధి గోపాలకృష్ణ స్పందిస్తూ.. గత వారం రోజులుగా ఆయిల్ కంపెనీల నుండి డీలర్లకు సరఫరా తగ్గడం కొంత ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. డీలర్ల నుంచి అందిన సమాచారం ప్రకారం చాలా ప్రాంతాల్లో డీజిల్ నిల్వలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. అయితే ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని ఈ రోజుతో రాష్ట్రంలోని 70-80 శాతం బంకులకు పూర్తిస్థాయిలో ఇంధనం చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు భయంతో ట్యాంకులు ఫుల్ చేయించుకోవడం వల్లే రద్దీ విపరీతంగా పెరుగుతోందని రెండు మూడు రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

వదంతులు నమ్మొద్దు

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈ అంశంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ జిల్లాలో ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని ఎక్కడా కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు అనవసరమైన పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దు. పెద్ద మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దు. ఎక్కడైనా కృత్రిమ కొరత కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి అని ఆయన సూచించారు.

అప్రమత్తమైన రవాణా శాఖ.. మంత్రి ఆదేశాలు

మరోవైపు రవాణా శాఖ మంత్రి ఎం. రామ్ ప్రసాద్ రెడ్డి కూడా ఈ సంక్షోభంపై స్పందించారు. తాత్కాలికంగా సరఫరాలో అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఎక్కడా నిలిచిపోకూడదని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ ఆపరేటర్లను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహించినా లేదా కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.