Let's talk: editor@tmv.in
ఏపీలో ఇంధన కొరత..కేంద్రానికి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ

ఏపీలో ఇంధన కొరత..కేంద్రానికి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ

Panthagani Anusha
29 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చిందని దీనివల్ల సామాన్య ప్రజలు, రైతులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకొని సరఫరాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను తన లేఖలో ప్రస్తావిస్తూ అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయని అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు చమురు కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోందని కొన్నిచోట్ల బంక్ యజమానులతో కూటమి నేతలు కుమ్మక్కై కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్యులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన విమర్శించారు.

ముఖ్యంగా ఈ ఇంధన సంక్షోభం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అవినాష్ రెడ్డి లేఖలో వివరించారు. సాగు పనుల కోసం డీజిల్‌పై ఆధారపడే రైతులు, బంకుల వద్ద నిరీక్షించలేక పనులు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దీనివల్ల వ్యవసాయ కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోవడంతో నిత్యావసరాల పంపిణీకి అంతరాయం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందించి ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన పెట్రోల్, డీజిల్ నిల్వలను పంపాలని ఆయన కోరారు. చమురు కంపెనీలతో మాట్లాడి రాష్ట్రంలో ఇంధన సరఫరా గొలుసును పునరుద్ధరించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజల ఇబ్బందులను గాలికి వదిలేయకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాలని అవినాష్ రెడ్డి తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఏపీలో ఇంధన కొరత..కేంద్రానికి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ - Tholi Paluku