Let's talk: editor@tmv.in
జగన్ హయాంలో పెరిగిన వ్యాట్‌తోనే ఇంధన ధరల భారం: హోంమంత్రి అనిత

జగన్ హయాంలో పెరిగిన వ్యాట్‌తోనే ఇంధన ధరల భారం: హోంమంత్రి అనిత

Panthagani Anusha
19 మే, 2026

రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ రికార్డు ధరలకు గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, మోపిన పన్నుల భారాలే కారణమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో విధించిన రకరకాల సెస్‌లు, అదనపు వ్యాట్ వల్లే నేడు రాష్ట్రంలో ఇంధన ధరలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయని ఆమె ఆరోపించారు. ఆ నష్టాన్ని కూటమి ప్రభుత్వం పూడ్చాలన్నా కుదరని రీతిలో అప్పటి పాలకులు ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారని మండిపడ్డారు.

ప్రజల సంక్షేమం పట్ల గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ తర్వాతి వైకాపా ప్రభుత్వానికి ఉన్న తేడాను మంత్రి అనిత ఈ సందర్భంగా తెలిపారు. 2019లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను పెంచిన తరుణంలో, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో లీటర్‌పై రూ. 2 తగ్గించి అప్పట్లోనే ఉపశమనం ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి పెట్రోల్‌పై రూ.8.59, డీజిల్‌పై రూ.6.48 చొప్పున పన్నుల రూపంలో బాదేశారని విమర్శించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అంటే మే 2019 నుంచి ఆగస్టు 2021 నాటికి పెట్రోల్ ధరను రూ. 76 నుంచి రూ. 107కు పెంచి రూ.41 భారం మోపగా డీజిల్ ధరను రూ. 68 నుంచి రూ. 99కు పెంచి రూ.31 అదనపు భారాన్ని ప్రజలపై రుద్దారని మండిపడ్డారు.

అదేవిదంగా గత వైకాపా ప్రభుత్వం ప్రజలపై మోపిన పన్నుల వివరాలను మంత్రి సుదీర్ఘంగా వివరించారు. ఫిబ్రవరి 2020లో పెట్రోల్‌పై రూ.2.76, డీజిల్‌పై రూ.3.07 చొప్పున వ్యాట్ పెంచుకుంటూ పోయి, మొత్తంగా పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్ పై 22.5 శాతం అత్యధిక వ్యాట్ విధింపును ఖరారు చేశారన్నారు. ఆ తర్వాత జులై 2020లో పెట్రోలు, డీజిల్‌లపై ఏకపక్షంగా లీటరుకు మరో రూ. 4 అదనపు వ్యాట్‌ను పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా సెప్టెంబరు 2020లో రోడ్డు అభివృద్ధి సెస్ పేరిట లీటరుకు మరో రూ.1 అదనంగా వసూలు చేశారన్నారు. ప్రపంచమంతా కోవిడ్ మహమ్మారితో అతలాకుతలమవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అన్ని రాష్ట్రాలూ ఇంధన ధరలను రూ.10 వరకు తగ్గించి ప్రజలను ఆదుకుంటే జగన్ రెడ్డి మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా మొండిగా వ్యవహరించారని దుయ్యబట్టారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ప్రజలపై కొత్తగా పైసా కూడా పన్ను భారం మోపలేదని మంత్రి స్పష్టం చేశారు. జూన్ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న పెట్రోల్ ధర రూ. 110 కాగా ప్రస్తుతం మే 2026 నాటికి అది రూ.113కు చేరిందని, అదేవిధంగా డీజిల్ రూ. 99 నుంచి రూ.101కు చేరిందని తెలిపారు. ఈ స్వల్ప పెరుగుదల కేవలం అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ వాతావరణం వల్ల కేంద్రం పెంచిన ధరల వల్లే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అదనపు పన్నులు వేయలేదని ఆమె స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని ఇంతలా విధ్వంసం చేసి ప్రజలపై మోయలేని భారాన్ని మోపిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కూటమి ప్రభుత్వం ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. వైకాపా హయాంలో చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రంపై ఎంత భారం పడిందో ప్రజలంతా గమనిస్తున్నారని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూనే ప్రజలపై భారం పడకుండా చూస్తోందని ఆమె పునరుద్ఘాటించారు.