Let's talk: editor@tmv.in
ఇంధన ధరల సెగ.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు

ఇంధన ధరల సెగ.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు

Panthagani Anusha
19 మే, 2026

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, తిరుపతి సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈ ఆందోళనలు హోరెత్తాయి.

వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు

రాష్ట్రవ్యాప్తంగా సాగిన ఈ నిరసనల్లో వైసీపీ శ్రేణులు వినూత్న పద్ధతులను అవలంబించి ప్రజల దృష్టిని ఆకర్షించారు. విశాఖపట్నంలో పార్టీ నేతలు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించగా కర్నూలు, విజయవాడ నగరాల్లో ఎద్దుల బండ్లతో ర్యాలీలు తీసి నిరసన తెలిపారు. ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుచోట్ల కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

గుర్రపు స్వారీతో నిరసన తెలిపిన మాజీ మంత్రి కె.వి. నాగేశ్వరరావు

ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, సీనియర్ వైఎస్సార్‌సీపీ నేత కె. వెంకట నాగేశ్వరరావు నిరసనగా గుర్రంపై స్వారీ చేస్తూ ప్రభుత్వ ఆర్థిక విధానాలను వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలపై నానా యాగి చేసిన టీడీపీ నేతలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ఇప్పుడు వాటిని మరింతగా పెంచి ప్రజలను వంచిస్తోందని విమర్శించారు.

పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే అధిక ధరలు

అయితే కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన ధరలు అత్యధికంగా ఉన్నాయని నాగేశ్వరరావు మండిపడ్డారు. ఇప్పటికే 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆటో డ్రైవర్లకు, ఈ ఇంధన ధరల పెంపు కోలుకోలేని దెబ్బగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంధన ధరలను ఏకంగా 31 శాతం పెంచడంతో పాటు రూ.5 సర్‌చార్జీ, రూ.1 రోడ్ ట్యాక్స్ విధించి సామాన్యుల నడుం విరుస్తోందని ఆరోపించారు. ఈ క్రూరమైన ధరల పెంపుతో ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్లీ “ఎద్దుల బండ్ల కాలానికి” తీసుకెళ్తోందని ఆయన విమర్శించారు.

రిక్షా తొక్కిన అంబటి రాంబాబు

మరోవైపు సీనియర్ వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా ఈ నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన స్వయంగా రిక్షా తొక్కుతూ ఇంధన ధరల పెంపుపై తన నిరసనను వ్యక్తం చేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోపిన ఈ అదనపు భారాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.