Let's talk: editor@tmv.in
ఇంధన ధరల మోత.. ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న కేంద్రం: వైఎస్ షర్మిల

ఇంధన ధరల మోత.. ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న కేంద్రం: వైఎస్ షర్మిల

Panthagani Anusha
26 మే, 2026

ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా పెరుగుతున్న ఇంధన ధరలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపై ఇంధన ధరల భారం మోపుతూ దేశంలో వాయిదాల పద్ధతిలో దోపిడీని కొనసాగిస్తోందని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పదించిన షర్మిల గత 10 రోజుల్లోనే వరుసగా నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం సామాన్య, మధ్యతరగతి ప్రజల నడుము విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చమురు ధరల పెంపు వల్ల దేశవ్యాప్తంగా రోజుకు సుమారు రూ. 1,000 కోట్ల అదనపు భారం ప్రజలపై పడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి ఇంకా తృప్తి కలగకపోవడం దారుణమన్నారు. ఇంధన సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో పన్నులు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాల్సిన బాధ్యతను విస్మరించి మరింత భారం మోపడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

గతంలో కాంగ్రెస్ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరించిన విధానాలను ఈ సందర్భంగా షర్మిల గుర్తుచేశారు. ఆనాడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పూర్తి భారం పడకుండా చూసిందని ఆ భారాన్ని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు, వినియోగదారుల మధ్య సమంగా పంచుకునేలా చేసి ఆర్థిక సమతుల్యతను కాపాడిన ఆనాటి విధానం ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నష్టాల పేరుతో మొత్తం భారాన్ని ప్రజలపై నెట్టేస్తోందని చమురు ధరలు తగ్గినప్పుడు భారీగా లాభాలు గడించిన కేంద్రం ఇప్పుడు ధరలు పెరిగాయనే సాకుతో ప్రజలను నిలువునా దోచుకుంటోందని విమర్శించారు.

ఇటీవల పెరిగిన ధరలతో ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.19కు, డీజిల్ ధర రూ.104.88కు చేరిందని దేశంలోనే అత్యధికంగా ఇంధన ధరలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంతలా భారాన్ని పెంచుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు మెదపకపోవడం, మౌనం వహించడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర పన్నులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అదనపు వసూళ్లు ప్రజలను మరింత కుదేలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో లీటర్ ఇంధనంపై అమల్లో ఉన్న రూ. 4 వ్యాట్, రూ. 1 రోడ్ సెస్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. తద్వారా ధరల మంటతో అలమటిస్తున్న ప్రజలకు కొంతైనా ఉపశమనం కల్పించాలని ఆమె స్పష్టం చేశారు.