Let's talk: editor@tmv.in
రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ఫ్రూట్ మార్కెట్ పనులు చేపట్టాలి: రామచందర్‌రావు
రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ఫ్రూట్ మార్కెట్ పనులు చేపట్టాలి: రామచందర్‌రావు

రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ఫ్రూట్ మార్కెట్ పనులు చేపట్టాలి: రామచందర్‌రావు

Gaddamidi Naveen
8 జూన్, 2026

కోహెడలో ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం స్థానిక రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఇప్పటివరకు సరైన నష్టపరిహారంగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా, వారి భూములను స్వాధీనం చేసుకోవడం తీవ్ర అన్యాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు మండిపడ్డారు. ఆదివారం కోహెడ గ్రామానికి చెందిన రైతుల ప్రతినిధి బృందం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి రాకముందే, తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లలో నిర్బంధించారని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాతే సాయంత్రం వారిని విడుదల చేశారని, ప్రశ్నించినందుకు రైతులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు. రైతుల సమస్యలను వినకుండా ప్రభుత్వం ఎర్త్‌మూవర్లతో పనులను ముందుకు తీసుకెళ్లడం వల్లే అక్కడ ఘర్షణలు, అరెస్టులు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. రైతులకు పూర్తి స్థాయిలో న్యాయమైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే మార్కెట్ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ, కోహెడ రైతులకు బీజేపీ సంపూర్ణంగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

సచివాలయం గేటు వద్దనైనా చర్చకు సిద్ధం

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించడంపై రామచందర్‌రావు తీవ్రంగా స్పందించారు. కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చింది అనే అంశంపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. తేదీ, సమయం నిర్ణయిస్తే సచివాలయం గేటు వద్దకైనా వచ్చి చర్చించడానికి తాము సిద్ధమని, దీనికి సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు.

మహబూబ్‌నగర్ సమావేశంలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని మండిపడ్డారు. వారిని సరిహద్దు దాటనివ్వను వంటి భాష సీఎం స్థాయికి తగదని హితవు పలికారు. బీజేపీ కార్యకర్తలు గనుక నిర్ణయించుకుంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని రామచందర్‌రావు హెచ్చరించారు.