
పడవ ప్రయాణం నుండి పక్కా జీవో వరకు!
కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రెండు రోజుల రాజమహేంద్రవరం పర్యటన ద్వారా దశాబ్దాలుగా నలుగుతున్న గోదావరి కాలుష్య సమస్యకు కేవలం 24 గంటల్లోనే చారిత్రాత్మకమైన, శాశ్వతమైన పరిష్కారం చూపించారని ఆయన కొనియాడారు. పరిశ్రమల లాభాల కంటే ప్రజల ఆరోగ్యమే పరమావధిగా భావించే నిజమైన ప్రజా నాయకుడు జనసేనాని అని అభివర్ణించారు. కేవలం రాబోయే పుష్కరాల కోసమే కాకుండా, కాబోయే తరాల పర్యావరణ భద్రతను కాపాడే దూరదృష్టి గల ఏకైక లీడర్ మన డిప్యూటీ సీఎం అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోందని, పవన్ కళ్యాణ్ తన మార్క్ యాక్షన్‌తో పాలకుడు అంటే ఇలానే ఉండాలని నిరూపించారని సోమవారం విడుదల చేసిన ఒక సుదీర్ఘ పత్రికా ప్రకటనలో మంత్రి దుర్గేష్ వివరించారు.
శరవేగంతో జీవో జారీ.. 'ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్'
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటన ముగిసిన కేవలం 24 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని ప్రధాన నదుల కాలుష్య నివారణే లక్ష్యంగా అత్యున్నత స్థాయి ‘ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఈ వేగం, నిబద్ధత చూసి అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ వర్గాలు అబ్బురపడ్డాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. నదుల సంరక్షణకు మాటల్లేవ్.. ఓన్లీ యాక్షన్ అనే విధంగా డిప్యూటీ సీఎం పయనిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి కేటాయించిన రూ. 100 కోట్ల నిధులతో పాటు, అవసరమైతే వీబీజీ రాంజీ, స్వచ్ఛాంధ్ర నిధులను దశలవారీగా వినియోగిస్తూ ఒక బృహత్తర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. పరిశ్రమల వ్యర్థాల నియంత్రణ కోసం ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి నదులపై లైవ్ మానిటరింగ్ చేపడతామని, ఈ టాస్క్ ఫోర్స్ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై క్షేత్రస్థాయి ప్రగతిని సమీక్షిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
సమాజాన్ని ఆలోచింపజేసిన డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్న..
రాబోయే 2027 గోదావరి పుష్కరాలకు దాదాపు 10 కోట్ల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, ఈ క్రమంలో "భక్తులు నదిలో రసాయనిక స్నానం చేయాలా? పవిత్ర స్నానం చేయాలా?" అని డిప్యూటీ సీఎం వేసిన ప్రశ్న యావత్ సమాజాన్ని, అధికారులను కదిలించిందని మంత్రి దుర్గేష్ అన్నారు. తానే స్వయంగా పడవపై వెళ్లి గోదావరి నది కన్నీటిని, నల్ల ఛానల్ కాలుష్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారని గుర్తు చేశారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వంటి పరిశ్రమల నుండి వస్తున్న రసాయన వ్యర్థాలు, నగర మురుగునీరు నదిలో కలవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కేవలం ఆగ్రహించడమే కాకుండా, 24 గంటల్లోనే ఆయా ప్రాంతాలను శుభ్రం చేయించడం పవన్ కళ్యాణ్ పట్టుదలకు నిదర్శనమన్నారు. 10 కోట్ల మంది భక్తుల ఆధ్యాత్మిక నమ్మకాన్ని గౌరవిస్తూ, రసాయనాల స్నానానికి స్వస్తి పలికి పవిత్ర స్నానానికి భరోసానిచ్చిన పర్యావరణ రక్షకుడు పవన్ కళ్యాణ్ అని మంత్రి కొనియాడారు.
భయాందోళన కలిగిస్తున్న కాలుష్య గణాంకాలు..
కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సేకరించిన గోదావరి కాలుష్య గణాంకాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఆరు జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీల నుంచి రోజుకు సుమారు 104 మిలియన్ లీటర్ల మురుగునీరు, గ్రామీణ ప్రాంతాల నుంచి 8.38 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచే రోజుకు 32 మిలియన్ లీటర్ల రసాయన వ్యర్థాలు, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నిత్యం 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యం నదిలోకి చేరుతోందని వివరించారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం నగరంలో ఉత్పత్తి అయ్యే 75 మిలియన్ లీటర్ల మురుగులో 50 మిలియన్ లీటర్లు నేరుగా నదిలోకి వదులుతున్నారని, తణుకు, భీమవరం, నరసాపురం, కొవ్వూరు మురుగునీరు సైతం డ్రెయిన్ల ద్వారా నదిలోకి చేరుతోందని మండిపడ్డారు. దీనిపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారని, పట్టణ ప్రాంతాల మురుగునీటిని 100 శాతం ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన తర్వాతే నదిలోకి వదలాలని కఠిన ఆదేశాలు ఇచ్చారన్నారు. పర్యావరణ ప్రమాణాలు ఉల్లంఘిస్తే ఎంతటి పెద్ద పరిశ్రమనైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
'స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు'..
వచ్చే పుష్కరాలను టార్గెట్ చేస్తూ ఏడాది ముందే 'స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు' పేరిట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్‌ను ప్రకటించారని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని 6 జిల్లాల పరిధిలో గల 262 పంచాయతీలను గుర్తించి, వాటిని 'మురుగు రహిత' గ్రామాలుగా తీర్చిదిద్దే విప్లవానికి శ్రీకారం చుట్టారన్నారు. కేవలం తాత్కాలిక పనులకు స్వస్తి చెప్పి, శాశ్వత పర్యావరణ రక్షణ కోసం వీబీజీ రాంజీ పథకం కింద మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం, బ్లాక్ వాటర్ నిర్వహణ కోసం సామాజిక ఇంకుడు గుంతలు, ప్రతి ఇంటికీ 'ఇండివిడ్యువల్ హౌస్ హోల్డ్ ట్విన్ పిట్స్' నిర్మించనున్నట్లు తెలిపారు. పంచాయతీ సిబ్బందితో నిరంతర పర్యవేక్షణా బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని, మురుగు నీరు కాదు.. భక్తులకు పవిత్ర జలాలు అందించడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని మంత్రి వివరించారు.
ప్లాస్టిక్ నిషేధం, నెటిజన్ల హర్షం
డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు గోదావరి పరివాహక మున్సిపాలిటీలన్నింటిలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగంపై దశలవారీగా కఠిన నిషేధాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి దుర్గేష్ ప్రకటించారు. వాయు, ద్రవరూప కాలుష్య నివారణకు పారిశ్రామిక వర్గాలు ఆధునిక సాంకేతికతతో కూడిన శుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, పరిశ్రమల పరిసరాల్లో విరివిగా పచ్చదనాన్ని పెంపొందించాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారన్నారు. జననేత పవన్ కళ్యాణ్ మాటల్లో కోపం కంటే గోదావరి మాతపై భక్తి, ప్రజల ఆరోగ్యంపై ఉన్న బాధ్యతే కనిపించిందని, ఆయన మందలింపు వ్యవస్థను పరుగులు పెట్టించిందని కొనియాడారు. "లీడర్ అంటే ఇట్లా ఉండాలి.. స్పాట్‌లోనే రివ్యూ.. రోజూలోనే రిజల్ట్.. ఇదే పవన్ కళ్యాణ్ మార్క్ రాజకీయం" అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెడుతున్న పోస్టులను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. గోదావరి మాతకు కాలుష్య విముక్తి కలిగించేందుకు సంకల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
