Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం!

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం!

Gaddamidi Naveen
20 ఏప్రిల్, 2026

హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో, మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్‌) రైళ్లలో ప్రయాణికులందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక ఆమోదం తెలిపింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదనపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

నగరంలో పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రయాణం వల్ల దక్షిణ మధ్య రైల్వేకు కలిగే సుమారు రూ.10 కోట్ల వార్షిక ఆదాయ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) సానుకూలంగా స్పందించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా అవగాహన ఒప్పందం సమర్పించాలని కోరింది. రైల్వే బోర్డు నుంచి తుది అనుమతులు లభించిన వెంటనే ఈ ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి రానుంది.

ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారి కూలీలకు ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి. బస్సులపై ఒత్తిడి తగ్గి, నగర ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు అందరికీ ఎంఎంటీఎస్ ఉచితం చేయడం నగర రవాణా వ్యవస్థలో ఒక చారిత్రక మైలురాయిగా నిలవనుంది.

నిత్యం 40 వేల నుంచి 45 వేల మంది ప్ర‌యాణం

హైదరాబాద్‌లో ప్రస్తుతం సుమారు రోజుకు సుమారు 40 నుంచి 45 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారని అంచనా. కోవిడ్‌కు ముందు ఇది 1.5 లక్షలకుపైగా ఉండగా, ప్రస్తుతం సేవలు తగ్గడం, కనెక్టివిటీ సమస్యల కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గింది. కోవిడ్ కంటే ముందు నిత్యం 120పైగా రైళ్ల నడిచేవి, ప్రస్తుతం 80-88 రైళ్లు మాత్రమే నడుస్తుండగా ప్రయాణికుల సంఖ్య 40 వేల నుంచి 45 వేల మధ్యన ఉంది. ఉచిత ప్రయాణం వల్ల మళ్లీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా.

మెట్రో, బస్సులపై రద్దీ ఎంతవరకు తగ్గుతుంది?

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణ నిర్ణయం వల్ల నగర రవాణా వ్యవస్థలో పెనుమార్పులు సంభవిస్తాయని అంచనా వేస్తున్నప్పటికీ, రద్దీ నియంత్రణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో మెట్రో, ఉచిత‌ బస్సులు, ఎంఎంటీఎస్ వేర్వేరు మార్గాల్లో సేవలు అందిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. మెట్రో ప్రధానంగా ఐటీ కారిడార్లను కవర్ చేస్తుంది. ఎంఎంటీఎస్ మార్గాలు భిన్నంగా ఉండటం వల్ల, మెట్రోలో రద్దీ కేవలం 5 నుంచి10 శాంత‌ మాత్రమే తగ్గే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ స్టేషన్ల పరిసరాల్లో ఉండేవారు రైలుకు మారడం వల్ల, ఆయా రూట్లలోని బస్సుల్లో 10నుంచి20 శాంత‌ వరకు రద్దీ తగ్గొచ్చు. ఎంఎంటీఎస్ నెట్‌వర్క్ పరిమితంగా ఉండటం, స్టేషన్ల నుంచి గమ్యస్థానానికి చేరడానికి మళ్లీ ఇతర వాహనాలపై ఆధారపడాల్సి రావడం వల్ల మెట్రో ప్రాధాన్యత తగ్గకపోవచ్చు. మొత్తంమీద, ఈ నిర్ణయం కొంతవరకు రద్దీని తగ్గించినప్పటికీ, మెట్రో, ఉచిత బస్సులపై కొంత ప్ర‌భావం ప‌డ‌నుంది.