
తెలంగాణలో బీసీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు
తెలంగాణలోని వెనుకబడిన వర్గాల (బీసీ) మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైపుణ్యం కలిగిన బీసీ మహిళల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు, వారికి 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా మహిళలు తమ ఉత్పాదకతను పెంచుకోవడమే కాకుండా, స్వయం సమృద్ధి గల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం లభించనుంది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అమలు
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు, బలహీన వర్గాల మహిళల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శనివారం బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమాయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య బట్టు, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ పథకం అమలుపై చర్చించారు.
ఈ పథకం ప్రకారం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 1,000 మంది చొప్పున అర్హులైన మహిళలను ఎంపిక చేసి, వారికి పూర్తి సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేస్తారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కుట్టు మిషన్ల పంపిణీతో పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా రూపొందిస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బలహీన వర్గాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా స్థిరపడేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఆటోమేటిక్ కుట్టు మిషన్ల ద్వారా మహిళలు తమ టైలరింగ్ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
