Let's talk: editor@tmv.in
త్వరలోనే వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన: మంత్రి పొంగులేటి

త్వరలోనే వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన: మంత్రి పొంగులేటి

Panthagani Anusha
19 ఏప్రిల్, 2026

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచేందుకు వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సచివాలయంలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్ కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డిలతో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ చారిత్రక నగరమైన వరంగల్‌లో విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే సుమారు 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. సాంకేతిక అనుమతులు తుది దశకు చేరుకున్నాయని అతి త్వరలోనే ఈ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిదంగా ఉత్తర తెలంగాణ ముఖద్వారమైన ఆదిలాబాద్‌లో విమానాశ్రయాన్ని రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో ప్రతిపాదించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతికంగా అనుకూలం కాదని కేంద్రం స్పష్టం చేయడంతో మంత్రి పొంగులేటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. భద్రాద్రి ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయం కోసం కొత్త స్థలాలను అన్వేషించాలని వాటి సాధ్యసాధ్యాలపై తక్షణమే సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. సిఎం రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తామని మంత్రి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.