
హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో శంకుస్థాపన:మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలకు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల పరిధిలోనే ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
శనివారం బంజారాహిల్స్‌లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర పరిధిలో తొలి విడతగా మంజూరైన లక్ష ఇందిరమ్మ ఇళ్లకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అదేవిదంగా ఏడాది వ్యవధిలోనే ఈ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తొలి విడత తర్వాత మరో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా ప్రజలకు దూర ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించే విధానాన్ని అనుసరించబోమని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఆ నియోజకవర్గ ప్రజలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి అందజేస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వ పథకాలు నేరుగా పేదల గుమ్మం వద్దకు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు.
ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సర్వే తదితర శాఖల సేవలను ఒకేచోట అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. అయితే ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా మూడు కార్పొరేషన్ల పరిధిలోని 13 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు.
అదేవిదంగా ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడకుండా రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రముఖ సంస్థలకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఫీనిక్స్ సంస్థ సుమారు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సమీకృత భవనాన్ని కొద్ది నెలల్లో పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. బంజారాహిల్స్ సముదాయంలో ఎస్.ఆర్.నగర్, బంజారాహిల్స్, గోల్కొండ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, డీఐజీ కార్యాలయం, రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్-గోల్కొండ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయని వీటి ద్వారా స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
