
కూటమి ప్రభుత్వ అక్రమాలపై మాజీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజం.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు
రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు అనంతరం వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధింపులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించిన భరత్ రామ్, ముఖ్యంగా బీసీ నాయకుడు పీతా రామకృష్ణను అక్రమంగా అరెస్టు చేసి పీడీ యాక్ట్ ప్రయోగించారని మండిపడ్డారు. నగరంలోని 40వ వార్డు పరిసరాల్లో టీడీపీ రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో దెబ్బలు తిన్న వారిని కాకుండా ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. ఈ చర్యలు ఒక ఎమ్మెల్యే ఒత్తిడితోనే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల ఘటనను ప్రస్తావిస్తూ, బాధిత బాలలకు తగిన వైద్యం అందకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అసెంబ్లీలో హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు సరైన వైద్య సహాయం అందలేదని, కుటుంబాలు భారీ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని ఆయన కోరారు.
ఇన్నిస్‌పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వ్యవహారంపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా దీర్ఘకాలంగా ఒకే వ్యక్తి చైర్మన్‌గా కొనసాగుతున్నారని, రూ.140 కోట్ల డిపాజిట్ల భద్రత ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రాజకీయ అండదండలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
గామన్ బ్రిడ్జి వద్ద డ్రెడ్జింగ్ బోట్లతో రాత్రింబవళ్లు ఇసుక దోపిడీ జరుగుతోందని, దీని వల్ల బ్రిడ్జి భద్రతకే ప్రమాదం ఏర్పడుతోందని భరత్ రామ్ పేర్కొన్నారు. స్థానిక మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటోందని, పర్యావరణ సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ అక్రమాలపై ఆధారాలు కలెక్టర్‌కు అందజేశామని తెలిపారు.
అలాగే వీరభద్ర నగరం వద్ద ముస్లింల కోసం ప్రతిపాదించిన షాదీఖానా నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేటాయించిన స్థలం, నిధులు ఉన్నప్పటికీ పనులు ప్రారంభించలేదని, ఈ విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. సమస్యలన్నింటిపై ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామని భరత్ రామ్ హెచ్చరించారు.
