
మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తలపెట్టిన రైతు ధర్నాకు వెళ్లకుండా మాజీ మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం హౌస్ అరెస్ట్ చేశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయ్ మండలంలో 'యూరియా యాప్' ను తక్షణమే రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులతో భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి పార్టీ పిలుపునిచ్చింది. ఈ రైతు నిరసన ప్రదర్శనలో పాల్గొనడానికి హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి బయలుదేరుతున్న వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు అక్కడికక్కడే అడ్డుకుని గృహనిర్బంధం చేశారు.
ఈ క్రమంలో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్లారెడ్డి వెళ్లి తీరుతానని స్పష్టం చేస్తూ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. రైతాంగ సమస్యల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అన్నదాతల పక్షాన నిలబడి వారి సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష నాయకులపై, ప్రజాప్రతినిధులపై ఈ విధంగా పోలీసు బలగాలను ప్రయోగించి అణచివేయాలని చూడడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం ఆపదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
