
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ
తెలంగాణలో పంటల కొనుగోళ్ల అంశంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, రైతుల ఇబ్బందులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన లేదని, కాంగ్రెస్ ప్రకటించిన 'రైతు డిక్లరేషన్' ఒక పెద్ద బోగస్ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అని గతంలో సీఎం చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా కొనుగోళ్లు ప్రారంభం కాలేదని, మిల్లుల వద్ద బస్తాకు ఒకటి రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఎండల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అలాగే పొద్దుతిరుగుడు రైతులు 20 రోజులుగా కేంద్రాల వద్ద వేచి ఉన్నా కొనుగోళ్లు జరగడం లేదని చెప్పారు. కేంద్రం కొంతమేర మాత్రమే కొనుగోలు చేయగా, మిగతా సుమారు 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని కోరారు. శనగ రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర రూ.5,875 ఉన్నప్పటికీ, ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ.3,000 నుంచి రూ.4,000కే అమ్ముకుంటున్నారని తెలిపారు. జొన్నలకు మద్దతు ధర రూ.3,371 ఉండగా, కేవలం రూ.2,500కే విక్రయించాల్సి వస్తోందని అన్నారు.
మొక్కజొన్న రైతులపై విధించిన పరిమితులను కూడా సడలించాలని హరీష్ రావు కోరారు. ఎకరాకు 26.50 క్వింటాళ్ల పరిమితి వల్ల రైతులు నష్టపోతున్నారని, ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు మిగిలిన పంట ఎక్కడ అమ్ముకోవాలో స్పష్టత లేదని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే అన్ని పంటలను మద్దతు ధరకు కొనకపోతే బీఆర్ఎస్ పక్షాన అలుపెరుగని పోరాటం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు.
