Let's talk: editor@tmv.in
మల్లారం వద్ద రైతులతో కలిసి ధర్నాకు దిగిన మాజీ మంత్రి హరీష్ రావు

మల్లారం వద్ద రైతులతో కలిసి ధర్నాకు దిగిన మాజీ మంత్రి హరీష్ రావు

Gaddamidi Naveen
4 మే, 2026

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట-కరీంనగర్ రాజీవ్ రహదారిపై మల్లారం వద్ద రైతులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరై రైతులకు సంఘీభావం ప్రకటించారు. రైతులతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ మొండి వైఖరిని నిరసించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ప్రకటించినప్పటికీ, వాస్తవంగా ఒక్క గింజ కూడా కొనుగోలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. మల్లారం ప్రాంత రైతులు 28 రోజులుగా వరి కొనుగోలు నిలిచిపోయిందని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. మొక్కజొన్న రైతులకు గన్నీ బ్యాగులు అందుబాటులో లేకపోవడంతో సొంతంగా బ్యాగులు తెచ్చుకుని ధాన్యాన్ని నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే సన్‌ఫ్లవర్ రైతుల పంటను కూడా 22 రోజులుగా కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు.

నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఎరువులు కొనాలంటే యాప్, వడ్లు అమ్మాలంటే ఆన్‌లైన్ విధానం తప్పనిసరి చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు అన్నారు. మండుటెండల్లో రైతులు రోడ్డెక్కాల్సి రావడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి వరి, మొక్కజొన్న, సన్‌ఫ్లవర్ సహా రైతులు పండించిన అన్ని రకాల పంటలను యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.