Let's talk: editor@tmv.in
ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్

ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్

Gaddamidi Naveen
7 జులై, 2026

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో పర్యాటక శాఖ చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించిన ముఖ్యమంత్రి, నిర్దేశించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో అటవీ శాఖకు చెందిన భూములను పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుని ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, గుర్రంగూడ ఎకో పార్క్ నమూనాలో నగరంలో మరిన్ని ఎకో పార్కులను అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. తారామతి బారాదరిని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా రూపొందించాలని తెలిపారు. అలాగే మంజీరా, దిల్‌కుషా అతిథి గృహాలను ఆధునికీకరించి పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా అక్కడి శ్రీ వీరభద్రస్వామి దేవాలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, యాదగిరిగుట్ట తరహాలో దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని సూచించారు.

సీయూఆర్‌ఈ పరిధిలో అర్బన్ ఫారెస్ట్ నమూనాలో ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే పురానాపూల్ వంటి వారసత్వ వంతెనలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, అవసరమైతే ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించి పర్యాటకులకు అనుకూలంగా మార్చాలని సూచించారు.

పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చే డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ఏర్పాట్లపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
TelanganaTelanganaTourismRevanthReddyHyderabadEcoTourismBharatFutureCityVikarabadTourismDevelopmentGlobalInvestmentSummit
ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్ - Tholi Paluku