

పరిగిలో బలవంతపు భూసేకరణ ఆపాలి: కవిత
వికారాబాద్ జిల్లా పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా సేకరించడాన్ని నిరసిస్తూ బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిశ్రమల పేరుతో చిన్న, సన్నకారు రైతుల నోటికాడ బుక్క లాక్కుంటున్నారంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ రైతులతో కలిసి వికారాబాద్ ఆర్డీవో ఆఫీస్ ఎదురుగా బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసుల జోక్యంతో ఉద్రిక్తత నెలకొంది. కవిత, విశారదన్ మహరాజ్‌లతో పోలీసులు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పరిశ్రమల పేరుతో చిన్న, సన్నకారు రైతుల భూములను లాక్కుంటున్నారని కవిత మండిపడ్డారు. పరిగి పరిసర ప్రాంతాల్లోని కల్లాపూర్, రాపోల్, భట్ల చందారం తదితర గ్రామాల్లో రైతుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. దాదాపు 1200 ఎకరాల భూమి సేకరణ జరుగుతోందని, అందులో ఎక్కువ భాగం అసైన్డ్ భూములేనని, మిగతా భూములు ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందినవేనని తెలిపారు. ప్రభుత్వమే గతంలో ఇచ్చిన భూములను ఇప్పుడు తిరిగి తీసుకోవడం రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కవిత పేర్కొన్నారు. మద్దతు ధర లేకపోవడం, రుణమాఫీ అమలు కాకపోవడం, ఎరువుల కొరత వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగానే సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి రైతుల తరఫున మరింత బలమైన ఉద్యమాలు చేపడతామని కూడా వెల్లడించారు.
పునర్విభజన సాకుతో దక్షిణాది గొంతు నొక్కలేరు
నియోజకవర్గాల పునర్విభజన పేరుతో తెలంగాణ ప్రజల గొంతుకను నొక్కేయాలని చూస్తే ఊరుకోబోమని కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత దెబ్బతింటుందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆమె తెలిపారు.
బుధవారం వికారాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కూడా తన నిరసనను వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వృద్ధిలో, కుటుంబ నియంత్రణలో దశాబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయని, అటువంటి ప్రగతిశీల రాష్ట్రాలను రాజకీయంగా బలహీనపరచడం ప్రజాస్వామ్య అన్యాయం అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం పార్లమెంటులో తెలంగాణ వాటా 3.13శాతం గా ఉంది. ఇది చాలా కనిష్టమని, పునర్విభజన తర్వాత ఈ శాతం ఇంకా తగ్గకూడదని ఆమె డిమాండ్ చేశారు. 3.13శాతం అనేది పునాది కావాలి తప్ప, అదే గరిష్ట పరిమితి కాకూడదు అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో 815 స్థానాలను రాష్ట్రాలకు, 35 స్థానాలను కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించాలని ప్రతిపాదన ఉంది. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి సీట్ల పెంపును ఒక సాకుగా చూపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ సార్వభౌమాధికారం కాపాడబడే వరకు వెనకడుగు వేయబోమని కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు.
