Let's talk: editor@tmv.in
అడవి బిడ్డల ఆత్మవిశ్వాసం కోసం.. 'ఆదివాసీ పర్యాటక ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్'
అడవి బిడ్డల ఆత్మవిశ్వాసం కోసం.. 'ఆదివాసీ పర్యాటక ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్'
అడవి బిడ్డల ఆత్మవిశ్వాసం కోసం.. 'ఆదివాసీ పర్యాటక ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్'

అడవి బిడ్డల ఆత్మవిశ్వాసం కోసం.. 'ఆదివాసీ పర్యాటక ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్'

Dantu Vijaya Lakshmi Prasanna
24 ఏప్రిల్, 2026

తెలంగాణ పర్యాటక శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు ఆధునిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు హైదరాబాద్ నగర సందర్శన భాగ్యాని కల్పించింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ 'ఆదివాసీ పర్యాటక ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్'ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అట్టడుగున ఉన్న గిరిజన ప్రజలకు పట్టణ జీవనశైలిని, రాష్ట్ర రాజధానిలోని చారిత్రక కట్టడాలను, ఆధునిక అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన సుమారు 250 మంది ఆదివాసీలు బుధవారం, గురువారం హైదరాబాద్‌లోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. వీరందరినీ ఆదిలాబాద్‌లోని గోండు గూడెం నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు ఐదు ఏసీ బస్సుల్లో జెండా ఊపి హైదరాబాద్‌కు పంపించారు. ఈ బృందానికి పర్యాటక శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. నగరం చేరుకున్న వీరు తారామతి బరాదరి సాంస్కృతిక సముదాయం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, చారిత్రక చార్మినార్, నెహ్రూ జూలాజికల్ పార్క్ వంటి ప్రదేశాలను ఆసక్తిగా తిలకించారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు గత ఏడాది డిసెంబర్‌లో తాను ఇచ్చిన హామీని ఈ రూపంలో నెరవేర్చారు. గతంలో ఆయన ఆదిలాబాద్ జిల్లాలోని కుమ్మరి కుంట గ్రామాన్ని సందర్శించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 1,800 మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో కేవలం నలుగురు మాత్రమే ఇంతవరకు హైదరాబాద్‌ను చూశారని తెలిసి ఆయన విస్మయానికి గురయ్యారు. ఆదివాసీల సామాజిక స్థితిగతులు, వారి అవగాహన స్థాయిని పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించిన మంత్రి, వెంటనే వారికి హైదరాబాద్ పర్యటన ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ పర్యటన కోసం లబ్ధిదారులను ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేశారు. గురువారం నాడు చార్మినార్ వద్దకు చేరుకున్న ఆదివాసీలకు పర్యాటక అధికారులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. కేవలం అడవులకే పరిమితమైన తమకు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చార్మినార్‌ను చూడటం ఒక కలగా ఉండేదని, ప్రభుత్వం చొరవతో తమ కోరిక నెరవేరిందని పర్యటకులు ఆనందం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను, జంతు ప్రదర్శనశాలలోని వైవిధ్యాన్ని చూసి వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.

పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రెండ్రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన గోండుగూడెం వాసులు బుధవారం ట్యాంక్ బండ్‌పై సందడి చేశారు. హుస్సేన్ సాగర్ అందాలను చూసి పరవశించిపోయారు. సచివాలయ కట్టడం, బాబాసాహెబ్ అంబేడ్కర్ భారీ విగ్రహంతో పాటు అమరజ్యోతి, బుద్ధుని వి గ్రహాన్ని చూసి సంబరపడ్డారు. ఆయా కట్టడాల విశేషాలను అధికారులు గిరిజనులకు వివరించి అవగాహన కల్పించారు.

పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కేవలం విహారయాత్ర మాత్రమే కాదని, ఇది ఆదివాసీల ఆలోచనా దృక్పథంలో మార్పు తీసుకురావడానికి చేపట్టిన ప్రయత్నమని పేర్కొన్నారు. పట్టణ జీవనం, ఆధునిక సాంకేతికత, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలను చూడటం వల్ల వారిలో కొత్త దృక్పథం ఏర్పడుతుందని, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై వారికి అవగాహన కల్పించడం కూడా ఈ యాత్రలో ఒక భాగం అన్నారు.

మొదటి విడతగా 250 మందికి అవకాశం కల్పించిన ప్రభుత్వం, మున్ముందు మరిన్ని బృందాలను హైదరాబాద్‌కు తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉన్న మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ఆదివాసీల విజ్ఞానానికి వారి సామాజిక వికాసానికి ఎంతగానో దోహదపడుతుందని పర్యాటక రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నగర సందర్శన ముగించుకుని తిరిగి వెళ్తున్న ఆదివాసీల ముఖాల్లో సంతృప్తి, నూతనోత్సాహం కనిపించిందని మంత్రి జూపల్లి సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.