Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో 81 చోట్ల ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

హైదరాబాద్‌లో 81 చోట్ల ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

Gaddamidi Naveen
4 మే, 2026

నగర ప్రజల, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం తన తనిఖీలను ముమ్మరం చేసింది. ప్రభుత్వ '99 రోజుల ప్రణాళిక'లో భాగంగా 59వ రోజైన ఆదివారం, పాఠశాలలు, పార్కులు, ఆట స్థలాలు, బేకరీల వద్ద ఉన్న తినుబండారాల కేంద్రాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నగరంవ్యాప్తంగా మొత్తం 81 ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా చిన్నారులు ఎక్కువగా సందర్శించే స్కూల్ పరిసరాలు, ఫుడ్ కోర్టులు, బేకరీలను అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా ఆహార వ్యాపార నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. ముడి పదార్థాలపై సరైన లేబులింగ్ ఉండాలని, ఆహార పదార్థాలను భద్రంగా నిల్వ చేసి సరైన విధంగా సంరక్షించాలని సూచించారు. అలాగే పురుగుల నివారణ చర్యలు కచ్చితంగా అమలు చేయడంతో పాటు సంబంధిత రికార్డులను పద్ధతిగా నిర్వహించాలని అవగాహన కల్పించారు.

అనుమానాస్పదంగా గుర్తించిన కొన్ని ఆహార నమూనాలను ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2006 ప్రకారం ప్రయోగశాల పరీక్షల కోసం సేకరించారు. తనిఖీలలో నిబంధనలు ఉల్లంఘించిన 14 సంస్థలకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యమని పేర్కొన్న జీహెచ్‌ఎంసీ అధికారులు, ఆహార భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో రాజీ ఉండదని హెచ్చరించారు.