Let's talk: editor@tmv.in
మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి
మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి

మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
14 మే, 2026

ప్రముఖ అంతర్జాతీయ రవాణా సేవల సంస్థ ఉబర్ తన వ్యాపార కార్యకలాపాలను హైదరాబాద్‌లో మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) దారా ఖోస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి జూబ్లీహిల్స్ నివాసంలో కలిసింది. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులు, రవాణా సమస్యలు, భవిష్యత్తు ప్రాజెక్టులపై కీలక చర్చలు జరిగాయి.

పార్కింగ్ సమస్యపై సీఎం ప్రత్యేక దృష్టి

నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ ఇబ్బందులను ప్రస్తావిస్తూ, ఈ సమస్య పరిష్కారానికి ఉబర్ సంస్థ ముందుకు రావాలని సీఎం సూచించారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందని, మెట్రో స్టేషన్ల వద్ద తగిన సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీఎం వివరించారు. అవకాశం ఉంటే ఉబర్ సంస్థ మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరారు. పార్కింగ్ కేంద్రాలతో పాటు విద్యుత్ వాహనాల (ఈవీ) కోసం ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేస్తామని ఉబర్ ప్రతినిధులు వెల్లడించారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ కార్యాలయం

హైదరాబాద్‌కు సమీపంలో 30 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ' గురించి సీఎం ప్రతినిధి బృందానికి వివరించారు. శంషాబాద్ విమానాశ్రయానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సిటీకి ప్రపంచ ప్రఖ్యాత 500 కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సీఎం వివరిస్తున్న ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకున్న ఖోస్రోషాహి, ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ కార్యాలయం నిర్మించడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ

అమెరికా వెలుపల ఉబర్ ఏర్పాటు చేసిన తొలి 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' హైదరాబాద్‌లోనే ఉందని, ప్రస్తుతం ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారని ఖోస్రోషాహి తెలిపారు. ఈ కేంద్రాన్ని మరింత విస్తరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కార్యకలాపాలు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉబర్ సీబీఓ మధు కన్నన్, ఉబర్ ఇండియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉబర్ వంటి అంతర్జాతీయ సంస్థలు మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వామ్యం కావడం నగరాభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.