
జర్మనీలో ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించండి: మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణ యువతకు విదేశాల్లో, ముఖ్యంగా జర్మనీ వంటి దేశాలలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జరిగిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ బోర్డు సమావేశంలో ఆయన పాల్గొని, విదేశీ నియామకాలపై కీలక దిశానిర్దేశం చేశారు.
జర్మనీలో నిపుణులైన కార్మికులకు, విద్యావంతులైన యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. యువతకు సరైన వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు, ఆయా దేశాల భాషలపై పట్టు సాధించేలా శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా జర్మన్ భాషా శిక్షణ అత్యంత కీలకం అని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం అత్యున్నత అర్హత కలిగిన భాషా బోధకులను తక్షణమే నియమించాలని, ముందుగా 'ట్రైనర్లకు శిక్షణ' ఇచ్చే కార్యక్రమాలను బలోపేతం చేయాలని సూచించారు. కేవలం భాష మాత్రమే కాకుండా, ఏ దేశానికి వెళ్తే ఆ దేశ సంస్కృతి, పనితీరుపై యువతకు అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. జర్మనీ వంటి దేశాలలో తెలంగాణ యువత విజయవంతంగా స్థిరపడితే, అది రాష్ట్రంలోని ఇతర విద్యావంతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, మరిన్ని విదేశీ అవకాశాల వైపు వారు అడుగులు వేయడానికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
విదేశీ ఉద్యోగాల కోసం టామ్‌కామ్ అత్యంత విశ్వసనీయమైన అధికారిక సంస్థ అని మంత్రి పునరుద్ఘాటించారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న సెమీ-స్కిల్డ్ కార్మికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ సేకరించాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు క్రమబద్ధమైన నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విదేశీ నియామకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని, ఇందుకోసం నిర్దేశిత లక్ష్యాలతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం యువతకు ప్రపంచస్థాయి ఉపాధి అవకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు.
