Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌ నుంచి హుబ్బళ్లి వెళుతున్న విమానం దారి మళ్లింపు

హైదరాబాద్‌ నుంచి హుబ్బళ్లి వెళుతున్న విమానం దారి మళ్లింపు

Shaik Mohammad Shaffee
21 ఏప్రిల్, 2026

హైదరాబాద్ నుంచి హుబ్బళ్లి వెళ్లాల్సిన 'ఫ్లై91' విమానం ఆదివారం వాతావరణం అనుకూలించక పోవడంతో గాలిలోనే చిక్కుకుపోయింది. హుబ్బళ్లిలో దిగాల్సిన సమయంలో భారీగా గాలి, వాన ఉండటంతో పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయలేకపోయారు. దీనివల్ల ప్రయాణికులు సుమారు మూడున్నర గంటల పాటు గాలిలోనే ఉండిపోయి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని బెంగళూరుకు మళ్లించడంతో అందరూఊపిరి పీల్చుకున్నారు . ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, కేవలం భద్రతా కారణాల దృష్ట్యానే ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు వివరించారు.

హైదరాబాద్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరిన ఈ విమానం (ఐసీ3401) షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు హుబ్బళ్లిలో దిగాల్సి ఉంది. అయితే హుబ్బళ్లి పరిసరాల్లో వాతావరణం అనుకూలించకపోవడంతో పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయలేకపోయారు. వాతావరణం మెరుగుపడుతుందనే ఆశతో దాదాపు గంటసేపు హుబ్బళ్లి ఆకాశంలోనే విమానం చక్కర్లు కొట్టింది. విమానం దిగకుండా గాలిలోనే తిరుగుతుండటంతో లోపల ఉన్న 22 మంది ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

కన్నీటి పర్యంతమైన ప్రయాణికులు

చాలా సేపటి వరకు విమానం భూమిపైకి దిగకపోవడంతో కొంతమంది ప్రయాణికులు భయంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రాణభయంతో దేవుడిని ప్రార్థిస్తూ గడిపారు. సాధారణంగా వాతావరణం సరిగ్గా లేనప్పుడు విమానం గాలిలో వేచి ఉండటం సాధారణ ప్రక్రియే అయినప్పటికీ, సుదీర్ఘ నిరీక్షణ ప్రయాణికులను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. చివరకు పైలెట్ నిర్ణయం మేరకు విమానాన్ని సాయంత్రం 6:30 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.

అర్ధరాత్రి హుబ్బళ్లికి చేరిక

బెంగళూరులో వాతావరణ పరిస్థితులను సమీక్షించిన అనంతరం, రాత్రి 11 గంటల సమయంలో విమానం తిరిగి హుబ్బళ్లికి బయలుదేరి వెళ్లింది. అక్కడ ప్రయాణికులను దింపిన తర్వాత విమానం తన బేస్ స్టేషన్ అయిన హైదరాబాద్‌కు చేరుకుంది. కేవలం ఈ విమానమే కాకుండా, ముంబై నుంచి కొల్హాపూర్ వెళ్లాల్సిన మరో విమానం కూడా వాతావరణం సరిగ్గా లేక గోవాకు మళ్లించాల్సి వచ్చిందని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సాంకేతిక లోపం లేదు: ఫ్లై91 వివరణ

ఈ ఘటనపై ఫ్లై91 సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను సంస్థ తీవ్రంగా ఖండించింది. "విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య లేదు. కేవలం వాతావరణం అనుకూలించకపోవడం వల్లే భద్రతా నిబంధనల ప్రకారం విమానాన్ని మళ్లించాం. ప్రయాణికుల భద్రత విషయంలో మేము ఎక్కడా రాజీ పడలేదు. మా పైలెట్లు, సిబ్బంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో సుశిక్షితులు" అని స్పష్టం చేసింది.

హైదరాబాద్‌ నుంచి హుబ్బళ్లి వెళుతున్న విమానం దారి మళ్లింపు - Tholi Paluku