
హర్యానాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
గత నెల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో హర్యానాలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేసింది. పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నారాయణగఢ్ ఎమ్మెల్యే శల్లీ చౌధరి, సాధౌరా ఎమ్మెల్యే రేణు బాలా, పున్హానా ఎమ్మెల్యే మొహమ్మద్ ఇల్యాస్, హతిన్ ఎమ్మెల్యే మొహమ్మద్ ఇస్రాయిల్, రాటియా ఎమ్మెల్యే జర్ణైల్ సింగ్‌లపై ఈ చర్య తీసుకున్నారు.
హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు రావ్ నరేందర్ సింగ్ మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఈ ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సిఫార్సు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హర్యానా కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యల కమిటీ (డీఏసీ) ఇటీవల ఈ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పార్టీ నేతృత్వానికి నివేదిక సమర్పించింది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసి తీవ్ర క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడ్డారని కమిటీ పేర్కొంది.
ఈ వ్యవహారంపై స్పందించిన కమిటీ చైర్మన్ ధర్మపాల్ మాలిక్ , బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి సతీశ్‌నందల్‌కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే ఆరోపణలపై నివేదిక తయారు చేసి పార్టీ నాయకత్వానికి పంపినట్లు తెలిపారు. మార్చి 16న హర్యానాలో రెండు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. బీజేపీ అభ్యర్థి సంజయ్ బాటియా సులభంగా గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి కర్మవీర్ సింగ్ బౌద్ రెండో స్థానాన్ని కష్టంగా గెలిచారు. అయితే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా పార్టీకి నష్టం జరిగిందని నాయకత్వం భావిస్తోంది. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌కు చెందిన నాలుగు ఓట్లు చెల్లని వాటిగా ప్రకటించారు. ఈ సంఘటనపై ముందుగా కాంగ్రెస్ పార్టీ ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే శల్లీ చౌధరి, రేణు బాలా, జర్ణైల్ సింగ్ తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ పార్టీ అభ్యర్థికే ఓటు వేసినట్లు సమాధానం ఇచ్చారు.
