Let's talk: editor@tmv.in
హర్మూజ్‌‌లో భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు

హర్మూజ్‌‌లో భారత నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు

Shaik Mohammad Shaffee
20 ఏప్రిల్, 2026

వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో సముద్రయాన భద్రత మరోసారి ప్రమాదంలో పడింది. భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు ముడి చమురు నౌకలపై ఇరాన్ సైన్యం శనివారం కాల్పులకు తెగబడటం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీ చేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఈ ఘటనపై తమ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రి, ఇరాన్ రాయబారి ఫతాలీతో సమావేశమై తాజా ఘటనపై భారత్ తరఫున తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకల భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో భారత్‌కు వచ్చే నౌకలకు ఇరాన్ సహకరించిన విషయాన్ని గుర్తు చేస్తూనే, ప్రస్తుత కాల్పుల ఘటన ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ ఘటనపై భారత అభిప్రాయాలను వెంటనే ఇరాన్ ఉన్నతాధికారులకు తెలియజేయాలని, హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని మిస్రి డిమాండ్ చేశారు.

అసలేం జరిగింది?

వెస్సెల్ ట్రాకర్ నివేదికల ప్రకారం.. భారత జెండాతో ఉన్న రెండు చమురు నౌకలు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరికగా కాల్పులు జరిపారు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ఆ నౌకలు తక్షణమే తమ గమ్యాన్ని మార్చుకుని వెనక్కి తిరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

యుద్ధ మేఘాల నీడలో జలసంధి

ఆరు వారాల క్రితం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన హర్మూజ్ జలసంధిని ఇరాన్ అప్పట్లోనే మూసివేసింది. అయితే శుక్రవారం నాడు వాణిజ్య నౌకల కోసం జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్, శనివారం మళ్లీ మూసివేసింది. అమెరికా కొన్ని ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించి, అటుగా వస్తున్న నౌకలపై కాల్పులకు తెగబడింది.

'అంగీకరించే ప్రసక్తి లేదు'

ఈ పరిణామాలపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే స్పందించారు. జపాన్ నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సరఫరా గొలుసులకు అంతరాయం కలగడం ఆందోళనకరమని, వాణిజ్య నౌకలపై దాడులను భారత్ ఎంతమాత్రం సహించబోదని హెచ్చరించారు. సురక్షితమైన, అడ్డంకులు లేని సముద్రయానమే భారత్ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

ప్రస్తుతం ఇరాన్ రాయబారి భారత నిరసనను తమ ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో భారత్ అప్రమత్తమైంది.